వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి..
ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
విజయవాడ, హైదరాబాద్, మే 25, ( వాయిస్ టుడే )
Scorching Heat: 76 Deaths in a Single Day; Minister Ponnam Prabhakar Expresses Concern

తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకూ మిన్నంటుతోంది. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నట్లుగా ఉష్ణోగ్రతలు నమోదువుతుండటంతో జనం విలవిలలాడుతున్నారు. వడదెబ్బతో ఆదివారం నాడు
ఏపీలో 18 మంది, తెలంగాణలో ఏకంగా 58 మంది మృతిచెండం విషాదాన్ని నింపుతోంది.ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో ఏకంగా 48.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. దీనితో పాటు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, పశ్చిమగోదావరి జిల్లా తణుకుల్లో 48.1 డిగ్రీలు, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా
కూనవరంలో 47.3 డిగ్రీలు, కృష్ణా జిల్లా నందివాడలో 47.1 డిగ్రీల చొప్పున అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 17 జిల్లాల్లోని దాదాపు 174 మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల
మార్కును దాటేశాయి.
మే 25 ఉష్ణోగ్రతల అంచనా:
సోమవారం 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
45°C – 47°C: కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం.
43°C – 45°C: విజయనగరం, మన్యం, కాకినాడ, మార్కాపురం, నెల్లూరు.
40°C – 43°C: రాయలసీమ జిల్లాలు, శ్రీకాకుళం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి
పిడుగులతో కూడిన వర్షాలు
ద్రోణి ప్రభావంతో ప్రకాశం, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం,చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మన్యం, అల్లూరి,
పోలవరం, అనకాపల్లి, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దహేగాం మండలంలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత
మరోవైపు తెలంగాణలోనూ ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలోనే అత్యధికంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం కుంచవెల్లిలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెల్గనూర్‌లో 46.4 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వడగాల్పుల
ప్రభావం తీవ్రంగా ఉంది.వడదెబ్బతో అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 20 మంది చనిపోగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 16 మంది, ఖమ్మం జిల్లాలో 11 మంది, నల్గొండలో 5 మంది,
ఆదిలాబాద్‌లో నలుగురు వ్యక్తులు, సిద్దిపేట జిల్లాలో ఇద్దరు మృతిచెందారు. రెండు రాష్ట్రాల్లోనూ రాబోయే మరో మూడు రోజుల పాటు ఎండలు, వడగాల్పుల తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని
వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించాయి. తీవ్రమైన వడగాల్పుల (Heatwave) దృష్ట్యా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పనులు ఉంటే తప్ప
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య కాలంలో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు, తగినన్ని నీళ్లు తీసుకోవాలని అధికారులు ప్రజలను
కోరారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ ఆందోళన..
వేసవి కాలంలో పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతలు, నిప్పు రవ్వల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వరుస అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల గీతా
కార్మికులకు జీవనాధారమైన ఈత, తాటి వనాలు పూర్తిగా దగ్ధమవుతున్నాయని, కాబట్టి గౌడ సోదరులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఇటీవల కాలంలో జమ్మికుంట మండలం
మడిపల్లి గ్రామం, జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం మెట్ల చిట్టాపూర్, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం కొలనూరు ప్రాంతాల్లో జరిగిన అగ్నిప్రమాదాల వల్ల ఈత వనాలు పూర్తిగా
కాలిపోయి, ఆయా గౌడ కుటుంబాలకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని మంత్రి గుర్తు చేశారు. ఈత, తాటి చెట్లను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని, వాటి సంరక్షణ ద్వారానే గౌడ కుటుంబాల జీవనోపాధిని
రక్షించగలమని స్పష్టం చేశారు.ఇలాంటి అగ్నిప్రమాదాలను నివారించేందుకు గీతా కార్మికులు గ్రామ స్థాయిలో కలిసికట్టుగా చెట్ల సంరక్షణ కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈత, తాటి చెట్ల కింద
పేరుకుపోయిన ఎండిపోయిన ఆకులు, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, చెట్లకు నీరు పట్టడం వంటి ముందస్తు చర్యలు తీసుకుంటే ప్రమాదాలను గణనీయంగా
తగ్గించవచ్చని సూచించారు. వీటితో పాటు ఈ వనాల సమీపంలో ఎవరూ బీడీలు, సిగరెట్లు కాల్చకుండా జాగ్రత్తలు పాటించాలని, నిర్లక్ష్యంగా నిప్పు వేయకూడదని హెచ్చరించారు. ఎక్కడైనా మంటలు
కనిపించిన వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించాలని కోరారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గీతా కార్మికులలో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన పెంపొందించేందుకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక
కార్యక్రమాలను నిర్వహించాలని తాను ఇప్పటికే ఎక్సైజ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు



