ఒక్కసారిగా 6.2 డిగ్రీలు తగ్గిన కనిష్ఠ ఉష్ణోగ్రత*
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి*
ఉత్తర దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తుండటమే కారణం
హనుమకొండ వణికిపోతోంది. అక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రత ఒక్కసారిగా 6.2 డిగ్రీలు తగ్గడమే ఇందుకు కారణం. ఇక్కడ రాత్రిపూట 22.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉండగా., నిన్న రాత్రి 16 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇక్కడే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉత్తర దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తుండటంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో సాధారణం కన్నా 1.7 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గింది. రాజేంద్రనగర్, పటాన్‌చెరులలోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మంలలోనూ స్వల్పంగా తగ్గాయి. మరోవైపు, కొన్ని ప్రాంతాల్లో పగలు వేడి, రాత్రి చలి వాతావరణం ఉంటోంది. మంగళవారం ఖమ్మంలో పగటిపూట సాధారణం కన్నా 3.8 డిగ్రీలు అధికంగా 35.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలంలో 1.7, హైదరాబాద్‌లో 1.3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.*