వంద స్థానాల్లో అభ్యర్థులను పెట్టే లక్ష్యంతో షర్మిల
విజయవాడ, జనవరి 24
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికలకు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంటనే జిల్లాల పర్యటన ప్రారంభించారు. ఇచ్చాపురం నుంచి ఆమె యాత్ర ప్రారంభించారు. ఇడుపులపాయ వరకూ సాగుతుంది. ఎన్నికలకు పెద్దగా సమయం లేనందున వెంటనే రంగంలోకి దిగారు. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు కనీసం వంద స్థానాల్లో అయినా బలమైన అభ్యర్థులను పెట్టే లక్ష్యంతో షర్మిల పార్టీకి ఉత్సాహం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంటోంది.షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరగానే ఆమె కండువా కప్పించుకున్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. వచ్చే ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున మంగళగిరి నుంచి పోటీ చేయడం ఖాయమే అనుకోవచ్చు. కాంగ్రెస్ లోకి రావాలని వైసీపీలో పెద్దగా ప్రాధాన్యత లభించని కీలక నేతలతో ఆళ్ల రామకృష్ణారెడ్డి సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో సీట్ల ఖరారును బట్టి కొంత మంది కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. అందుకే ఆయా పార్టీల్లో చేరినా పోటీ చేసే అవకాశం లభించదు. బీజేపీకి పెద్దగా బలం లేదనందున ఆ పార్టీలో చేరలేదు. ఇక ఆప్షన్ ఉంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. నిజానికి షర్మిల ఆ పార్టీలో చేరే వరకూ ఎవరూ పట్టించుకోలేదు. నీ షర్మిల చేరిన తర్వాత కొంత మంది ఆ పార్టీని ఓ ఆప్షన్ గా పెట్టుకున్నారు. దీంతో ఎక్కువగా చేరికలు ఉంటాయన్న ప్రచారం ఊపందుకుంటోంది.వైఎస్ షర్మిల యాత్ర చేస్తున్నారు. ఈ యాత్ర ఇడుపుల పాయ చేరుతుంది. ఈ యాత్రలో రాయలసీమకు చెందిన పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి గుమ్మనూరు జయరాంకు ఈ సారి అసెంబ్లీ టిక్కెట్ నిరాకరించారు. ఎంపీ టిక్కెట్ కేటాయించారు. కానీ ఎంపీ వద్దు ఎమ్మెల్యే టికెటే కావాలని గుమ్మనూరు జయరాం పట్టుబడుతున్నారు. కావాలంటే తన వారసుడు గుమ్మనూరు ఈశ్వర్ కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తాను ఎంపీగా పోటీ చేస్తానని జయరాం చెబుతున్నారు. వేరే వారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆలూరు నియోజకవర్గంలో అనేక సంవత్సరాలుగా ఉన్న కేడర్ దెబ్బతింటుందని, అందుకే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే సిద్ధంగా ఉన్నట్లు మంత్రి జయరాం చెబుతున్నారు. ఆయన కర్ణాటక కాంగ్రెస్ లో ముఖ్యమైన నేతలకు సన్నిహితుడు. దీంతో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ఇక వైసీపీలో కీలక నేతగా ఉన్న రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పెద్దగా కనిపించడం లేదు. ఆయనకు కూడా టిక్కెట్ నిరాకరిస్తారన్న ప్రచారం జరుగుతూండటంతో కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. ఈ క్రమంలో పది మంది ఎమ్మెల్యేల వరకూ కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నారని.. రాబోయే రోజుల్లో రాయలసీమలో చేరికలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ ద్వారా పోటీకి ఓ ఆప్షన్ ఉండటంతో అటు వైసీపీతో పాటు ఇటు టీడీపీలో కూడా సీటు రాని నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు చూసే అవకాశం ఉంది. షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పరిస్థితి మెరుగు పడిందన్న అభిప్రాయంతో కొంత మంది ఉన్నారు. పాత కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా ప్రస్తుతం వైసీపీ వైపు ఉంది. కానీ వైసీపీపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోందన్న అభిప్రాయం పెరుగుతున్న సమయంలో అలాంటి వారి ఓట్లన్నీ మళ్లీ కాంగ్రెస్ కు వస్తాయన్న గట్టి నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ పుంజుకుంటే కీలక నేతలుగా మారే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.ఎన్నికలు దగ్గర ఉన్నందున అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ముఖ్యులు సమాంతరంగా కసరత్తు చేస్తున్నారు. ఇతర ప్రధాన పార్టీలు అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేశాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది. పార్టీలో ఉన్న సీనియర్లు అందరికీ వారు కోరుకున్న స్థానాల్లో సీట్లు కేటాయిస్తారు. కాస్త సొంత బలం ఉన్న నేతలు పార్టీలో చేరితే ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది. రెండు, మూడు చోట్ల గెలిచినా కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసినట్లవుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలకు ముందు ఊహించని జోష్ కనిపిస్తోంది.
వంద స్థానాల్లో అభ్యర్థులను పెట్టే లక్ష్యంతో షర్మిల
- Advertisement -
- Advertisement -