హైదరాబాద్, అక్టోబరు 12: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నిర్ణయించారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని గత కొద్ది రోజులుగా చర్చ నడుస్తోంది. ఇన్నాళ్లు జరిగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో ప్రస్తుతం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించిన షర్మిల… బీఫామ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పాలేరులో పోటీ చేయాలని తనపై ఒత్తిడి ఉందని తనతోపాటు అనిల్, విజయ కూడా పోటీ చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నట్టు షర్మిల తెలిపారు. అవసరం అనుకుంట్ వారు కూడా బరిలో ఉంటారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం బాగు కోసం కాంగ్రెస్‌తో చర్చలు జరిపినట్టు పేర్కొన్నారు షర్మిల. బీఆర్‌ఎస్‌ను ఓడించాలంటే కలిసి ఉంటే బాగుంటుందని భావించామన్నారు. అందుకే ఓటు చీలిపోకుండా కలిసి పోటీ చేయాలని చర్చలు జరిపినట్టు వివరించారు. అయితే అవి సత్ఫలితాలను ఇవ్వలేదని అందుకే ఒంటరిగానే బరిలోకి దిగబోతున్నట్టు తెలిపారు. కచ్చితంగా భారీ విజయం సాధించి వైఎస్‌ఆర్ పాలన తీసుకొని వస్తారమన్నారు షర్మిల.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిస్తే మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారనే కాంగ్రెస్‌తో చర్చలు జరిపినట్లు ఆమె వ్యాఖ్యానించారు. దాని కోసం నాలుగు నెలలు వేచి ఉన్నా అట్నుంచి స్పందన రాలేదని షర్మిల తెలిపారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాము మ్యానిఫెస్టో రూపొందిస్తున్నామని, మూడు, నాలుగు రోజుల్లో విడుదల చేస్తామని YTP ప్రకటించింది. . ఎన్నికల్లో పోటీ కోసం రైతు,నాగలి గుర్తును YTP కోరింది. దానిపై త్వరలోనే స్పష్టం వస్తుందని YTP తెలిపింది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో ఇక ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది YTP అధ్యక్షురాలు షర్మిలకు. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక, KC వేణుగోపాల్‌తో షర్మిల అనేకసార్లు భేటీ అయ్యారు. కాంగ్రెస్‌కు ప్రస్తుతం ట్రబుల్ షూటర్‌గా ఉన్న కర్నాటక డిప్యూటీ సీఎం DK శివకుమార్‌ను కూడా అనేకసార్లు కలిశారు. షర్మిల డిమాండ్స్ విషయంలో తేడా రావడంతో విలీనం ఆగిపోయింది. ఈ క్రమంలో ఒంటరిగా చేయాలా లేదంటే ఏకంగా ఎన్నికలకు దూరంగా ఉండాలా అనేదానిపై షర్మిల సమాలోచలను చేశారు. చివరికి ఒంటరి పోరుకే ప్రాధాన్యం ఇచ్చారు.కాంగ్రెస్‌లో విలీనానికి షర్మిల ప్రధానంగా రెండు షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. ఒకటి.. తనను తెలంగాణ రాజకీయాలకే పరిమితం చేయాలి. రెండు.. పాలేరు టికెట్టే ఇవ్వాలి. చూడ్డానికి చిన్నవే అయినా.. తెలంగాణ సమాజంపైనా, తెలంగాణ రాజకీయాలపైనా ప్రభావం చూపించే కండీషన్స్ ఇవి. కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలంగాణ రాజకీయాల్లోకి షర్మిల వస్తే.. అది పార్టీకి తీరని నష్టం అని హైకమాండ్‌కు రాష్ట్ర పీసీసీ నివేదిక ఇచ్చి ఉండొచ్చు. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీని తెలంగాణ సమాజం ఎంత వరకు యాక్సెప్ట్ చేసిందో ఇంత వరకు తెలీదు. ఎందుకంటే, ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు కాబట్టి. కాని, కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ రాజకీయాల్లోకి షర్మిల వస్తే గనక.. ఆ ఇంపాక్ట్ గురించి ఎన్నికలు జరిగేంత వరకు ఆగనక్కర్లేదు. ఆల్రడీ 2018 అనుభవం ఉండనే ఉంది. టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నందుకు తెలంగాణ సెంటిమెంట్‌ను ఏ రేంజ్‌లో ఉపయోగించుకున్నారో అందరూ చూశారు. కాంగ్రెస్‌లోకి షర్మిల ఎంట్రీ ఇచ్చినా మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఎన్నికలకు రెండు నెలల ముందు ఎలాంటి పొరపాట్లు చేయకూడదని రాష్ట్ర పీసీసీ కూడా హైకమాండ్‌కు గట్టిగానే చెప్పినట్టు కనబడుతోంది. కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనం ఆగిపోడానికి ఇదే ప్రధాన కారణం అయి ఉంటుంది. పైగా ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర నాయకత్వం చెప్పేది కూడా హైకమాండ్ వినాల్సి ఉంటుంది. షర్మిలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటే రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి చెందే అవకాశం ఉంది. ఎన్నికల ముందు పీసీసీ చీఫ్ అసహనంగా ఉండడం పార్టీకి మంచిది కాదని హైకమాండ్ భావించి ఉండవచ్చు.



