రెండేళ్లలో శాంతిభద్రతలు, మహిళా రక్షణ, డ్రగ్స్ నియంత్రణలో గణనీయ పురోగతి
ప్రజా భద్రత, సైబర్ రక్షణ, విపత్తు నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ విశిష్ట పురోగతి
సాంకేతికత, పారదర్శకత, జవాబుదారీతనంతో సమగ్ర సంస్కరణలు
రాష్ట్ర హోం వ్యవహారాలు మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత వంగలపూడి
Significant progress in law and order, women’s safety, and drug control over the past two years.
అమరావతి, జూన్ 16:
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం గత రెండేళ్ల కాలంలో శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల రక్షణ, డ్రగ్స్ నియంత్రణ, సైబర్ నేరాల అరికట్టడం, విపత్తుల నిర్వహణ, జైళ్ల సంస్కరణలు, పోలీసు సంక్షేమం వంటి అన్ని రంగాల్లో సమగ్ర సంస్కరణలను చేపట్టి విశేష ఫలితాలు సాధించిందని రాష్ట్ర హోం వ్యవహారాలు మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత వంగలపూడి తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రయోజనాలకు పరిమితమైన వ్యవస్థలను ప్రజా సేవా దృక్పథంతో పునర్నిర్మిస్తూ, ప్రజలకు జవాబుదారీగా పనిచేసే పరిపాలనా వ్యవస్థను ప్రభుత్వం నెలకొల్పిందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ అనేది కేవలం అధికార ప్రదర్శన కాదని, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునే బాధ్యతగా ప్రభుత్వం విశ్వసిస్తోందని ఆమె తెలిపారు.
ప్రజల భాగస్వామ్యం, పోలీసు-ప్రజల సమన్వయం, సాంకేతికత వినియోగం, పారదర్శక పరిపాలన, వేగవంతమైన స్పందన, చట్టాలను కఠినంగా అమలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యంత సురక్షిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. నేరం జరిగిన తర్వాత స్పందించడం కాకుండా, నేరం జరగకుండా ముందుగానే నిరోధించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్రజల భద్రత, మహిళల గౌరవం, యువత భవిష్యత్తు, సమాజ శాంతి కోసం రాజీపడకుండా తమ ప్రభుత్వం పనిచేస్తుందని అని మంత్రి స్పష్టం చేశారు.




