పెద్దశేష వాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో సిరులతల్లి
Sirulathalli in the decoration of Paramapada Vaikunthanatha on Pedeshesha vehicle
తిరుపతి
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన శుక్రవారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు. అభయ వరదహస్తయైన శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞానబలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుంది.
కాగా రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు అమ్మవారు హంస వాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు.
ఉదయం జరిగిన పెద్దశేష వాహన సేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్‌స్వామి, ఈవో జె. శ్యామల రావు, జెఈవోలు వీరబ్రహ్మం, గౌతమి ఆలయ డిప్యూటీ ఈవో గోవింద రాజన్, ఆలయ అర్చకులు బాబు స్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.