నిజామాబాద్, నవంబర్ 6, (వాయిస్ టుడే ): తెలంగాణ ఎన్నికల రాజకీయం రంజుగా మారుతోంది. బీఆర్ఎస్ వర్సస్ కాంగ్రెస్ పోటీ ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సారి రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఇదే సమయంలో గజ్వేల్ నుంచి ఈటల..కామారెడ్డి నుంచి రేవంత్ రెండో స్థానంగా కేసీఆర్ పైన పోటీకి దిగుతున్నారు. కేసీఆర్ పై పోటీకి రేవంత్ కు పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం వెనుక భారీ స్కెచ్ ఉంది. గురి కుదిరితే సంచలనం నమోదవుతుందని పార్టీ అంచనా వేస్తోంది. కేసీఆర్ వర్సస్ రేవంత్: తెలంగాణఎన్నికల్లో సీఎం కేసీఆర్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. తన సొంత నియోజకవర్గం గజ్వేల్ తో పాటుగా కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతున్నారు. కేసీఆర్ పైన పోటీకి బీజేపీ నుంచి గజ్వేల్ బరిలో మాజీ మంత్రి ఈటల దిగుతున్నారు. దీంతో పాటుగా తన నియోజకవర్గం హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే, అనూహ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ ను ముఖ్యమంత్రి పైన పోటీకి దింపాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. అక్కడ సీటు ఆశిస్తున్న షబ్బీర్ అలీకి నిజామాబాద్ అర్బన్ ఖరారు చేసింది. ఈ నెల 10న కర్ణాటక సీఎం సిద్దరామయ్య కామారెడ్డిలో పార్టీ బహిరంగ సభలో పాల్గొంటారు. బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారు. అదే రోజున రేవంత్ కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ కొత్త లెక్కలు: కామారెడ్డిలో సిట్టింగ్ ఎమ్మెల్యే కాదని కేసీఆర్ బరిలో నిలిచారు. రెండు నియోజకవర్గాల్లో గెలిస్తే ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కేసీఆర్ కొనసాగుతారనే దాని పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గజ్వేల్ తో తన అనుబంధం కొనసాగుతుందని కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. ఇదే సమయంలో కేసీఆర్ పైన రేవంత్ ను పోటీకి దింపాలనే కాంగ్రెస్ నిర్ణయం వెనుక భారీ వ్యూహమే కనిపిస్తోంది. కేసీఆర్ ను ఢీ కొట్టటం ద్వారా రేవంత్ ఇమేజ్ పెరగటం ఖాయంగా కనిపిస్తోంది.
నియోజకవర్గంలో ఉన్న సామాజిక సమీకరణాల్లో భాగంగా అక్కడే బీసీ డిక్లరేషన్ విడుదలకు కాంగ్రెస్ నిర్ణయించింది. కామారెడ్డి నుంచి గతంలో గెలిచిన షబ్బీర్ అలీ వంటి ప్రముఖ మైనార్టీ నేతను ఓడించేందుకు కేసీఆర్ ఇక్కడ పోటీ చేస్తున్నారని..అక్కడ మైనార్టీ నేత ఓడిపోకుండా మరో నియోజకవర్గానికి మార్చి..అక్కడ రేవంత్ పోటీకి దిగటం ద్వారా అక్కడి పరిస్థితులను సానుకూలంగా మలచుకోవాలనేది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. కామారెడ్డి నుంచి తొలుత బీజేపీ అభ్యర్దిగా ఎంపీ అర్వింద్ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆ తరువాత అభ్యర్దుల ప్రకటనలో మారింది.దీంతో, కాంగ్రెస్ వ్యూహం మార్చింది. బీసీ ఓట్ బ్యాంక్ పైన అక్కడ గురి పెట్టింది. గురి కుదిరితే పూర్తి అనుకూలంగా మారుతుందని లెక్కలు వేస్తోంది. ఇదే సమయంలో షబ్బీర్ అలీని నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీకి ఒప్పించింది. అక్కడ పెద్ద సంఖ్యలో మైనార్టీ ఓట్లు ఉన్నాయి. దీంతో, అక్కడ షబ్బీర్ అలీకి గెలుపు సునాయాసంగా భావిస్తున్నారు. ఇటు రేవంత్ కొడంగల్ తో పాటుగా కామారెడ్డిలో పోటీ చేయటం ద్వారా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల్లో తానే నేరుగా కేసీఆర్ ను ఢీ కొడితే కేడర్ లో జోష్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో పాటుగా కేసీఆర్ కు గెలుపు కష్టతరం చేయాలనేది వ్యూహం. దీని ద్వారా మొత్తంగా ఆ ప్రాంతం పైన ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సమీకరణాలతో కామారెడ్డిలో కేసీఆర్ వర్సస్ రేవంత్ పోటీ ఆసక్తి కరంగా మారుతోంది.