ఈ నెల 27 నుంచి డిసెంబర్ 1 వరకు
డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ వెల్లడి
తాడేపల్లిగూడెం: ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గోపీనాథపట్నం గ్రామంలో ఈనెల 27 నుంచి డిసెంబరు ఒకటో తేదీ వరకు శ్రీ భక్తాంజనేయ స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవాదాయ ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఆయన నివాసంలో బుధవారం ఈ మహా కృతువుకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి కొట్టు వెంకటేశ్వరరావు 62 సంవత్సరాల క్రితం గోపీనాథ పట్నం గ్రామంలో ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. అప్పట్నుంచి ప్రతి సంవత్సరం వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలతో ఆలయాన్ని తీర్చిదిద్దారన్నారు. కళ్యాణ మండపం, గీతా మందిరం, రామకోటి కృతువు, భగవత్ సంబంధిత విగ్రహాలు ఏర్పాటు చేసి ఆలయాలను నిర్మించి పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారని వివరించారు. దానిని మరింత అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాతి కట్టడంతో ఆలయం నిర్మాణం చేపట్టామని మంత్రి కొట్టు చెప్పారు. కొన్ని వందల సంవత్సరాలు పాటు చెక్కు చెదరకుండా పదిలంగా ఉండేలా రాతి కట్టడంతో ఆలయాన్ని నిర్మించామన్నారు. తమ తల్లిదండ్రులు కీర్తిశేషులు కొట్టు వెంకటేశ్వరరావు, సరస్వతి పుణ్య దంపతుల దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలియజేశారు. ఇందులో భాగంగా ఈనెల 27 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు శ్రీ భక్తాంజనేయ స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు నిర్వహించ తలపెట్టినట్లు వెల్లడించారు. ఈనెల 27వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటల 37 నిమిషాల శుభ ముహూర్తం నుంచి ఈ మహా కృతువు ప్రారంభమవుతుందన్నారు. ఈ సందర్భంగా ఐదు రోజులపాటు శాంతి హోమాలు, ఆగమ శాస్త్రానుసారం అనేక దైవిక భక్తి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతిరోజు విశేషమైన పూజలు, యజ్ఞ యాగాలు, హోమాలు, అభిషేకాలు తదితర దైవ సంబంధిత కార్యక్రమాలు పండిత శ్రీమాన్ డాక్టర్ వేదాంతం రాజ గోపాల చక్రవర్తి ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చక స్వాములు నిర్వహిస్తారని వివరించారు. డిసెంబర్ ఒకటో తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల 21 నిమిషాలకు శుభముహూర్తాన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవాదాయ ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ, సౌధని కుమారి దంపతులచే శ్రీ భక్తాంజనేయ స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ట నిర్వహించబడుతుంది. అదేరోజు ఉదయం 11 గంటల నుంచి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆహ్వాన కమిటీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఆహ్వాన పత్రాలు విడుదల కార్యక్రమంలో ఆయనతోపాటు యూత్ లీడర్ కొట్టు విశాల్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కర్రి భాస్కర రావు, జే సి ఎస్ కన్వీనర్ కొలుకులూరి ధర్మరాజు, ఏఎంసి డైరెక్టర్ గార్లపాటి వీరకుమార్, తదితరులు పాల్గొన్నారు.



