వేములవాడలో వింత ఆచారం
కరీంనగర్, ఏప్రిల్ 7, (వాయిస్ టుడే
Strange custom in Vemulawada
శ్రీరామనవమి సందర్భంగా అంతట సీతారాముల కల్యాణం జరిగితే వేములవాడలో వింత వివాహాలు జరిగాయి. రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో సీతారాముల కల్యాణ శుభముహూర్తాన శివపార్వతులు జోగినిలు (ట్రాన్స్ జెండర్స్) శివుడిని పెళ్లి చేసుకున్నారు. ఓవైపు సీతారాముల కల్యాణం జరుగుతుంటే మరోవైపు స్త్రీ పురుష వయోభేదం లేకుండా వేలాదిగా తరలివచ్చిన శివపార్వతులు జోగినీలు, చేతిలో త్రిశూలం, నెత్తిన జిలకర బెల్లం పెట్టుకుని పెళ్లికూతురులా తయారై దేవుడిని పెళ్లి చేసుకున్నారు. త్రిశూలానికి భాషింగం కట్టి, మెడలో రుద్రాక్ష మాల, పసుపు కొమ్ము వేసుకొని ఒకరిపై మరొకరు అక్షంతలు చల్లుకుంటూ తలంబ్రాలు పోసుకుని దేవుడితో పెళ్లైనట్లు భావించారు. వేములవాడలో శ్రీరామనవమికి ఓ ప్రత్యేకత ఉంటుంది. రాజేరాజేశ్వరస్వామి సన్నిధిలో సీతారాముల కల్యాణంతో పాటు శివపార్వతులు జోగినిలు, ట్రాన్స్ జెండర్స్ శివుడిని పెళ్లి చేసుకుంటారు. ఒకే వేదికపై రెండు వివాహ సన్నివేశాలు వేములవాడలో కనిపించడం ప్రత్యేకత. ప్రతి ఏటా శ్రీరామనవమికి కన్నుల పండువలా సీతారాముల కల్యాణంతోపాటు శివపార్వతులు శివుడిని పెళ్లి చేసుకోవడం వింత ఆచారం అనాదిగా కొనసాగుతుంది.వింత ఆచారాన్ని రూపుమాపేందుకు శివపార్వతుల కోసం ప్రత్యేకంగా మహాశివరాత్రి తర్వాత శివ కల్యాణం నిర్వహిస్తున్నప్పటికీ ధారణ చేసుకునే శివపార్వతులు మాత్రం శ్రీరామనవమికే వేములవాడకు వచ్చి దేవుడిని పెళ్లి చేసుకోవడం విశేషం. అనేక దశాబ్దాలుగా సాగుతున్న శివపార్వతుల పెళ్లి విశ్వాసంతో మొదలై, ఆచారంగా పరిణమించింది. జీవనశైలిగా ఇక్కడ దర్శనమిస్తోంది. అలవికాని పేదరికం, తీవ్రమైన అనారోగ్యం, ఎదుగు బొదుగులేని జీవితం, నిరాశావహమైన భవిష్యత్తు వారిని దేవుణ్ణి పెళ్లి చేసుకునేలా చేస్తున్నాయి.వేదికపై ఓవైపు దేవతామూర్తులకు కళ్యాణోత్సవం వైభవంగా సాగుతుంటే, ఆ సన్నిధిలోనే జోగినీలు శివుడిని తమ నాధునిగా భావించి ధారణ చేస్తారు. కేవలం ఈ వివాహం కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా చత్తీస్గడ్, మహారాష్ట్ర ల నుండి వేలాదిగా భక్తులు తరలివస్తారు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్ ,జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, కొమరం భీం, మంచిర్యాల, ఆదిలాబాద్, జనగామ, వరంగల్, సిద్దిపేట, మెదక్ జిల్లాల నుండి ఎక్కువగా, ఇతర జిల్లాల నుండి సంఖ్య కాస్త తక్కువగా శివపార్వతులుగా మారిన స్రీలు,పురుషులు, పిల్లలు వేములవాడలో జరిగే శ్రీరామ నవమికి తప్పక హాజరవుతారు. సీతారామ చంద్రులకు తలంబ్రాలు సమర్పించే వేళ వేములవాడ రాజన్న సన్నిధిలో శివపార్వతుల వివాహ ఘట్టం తలంబ్రాల వర్షం కురుస్తున్నట్టు మారిపోతుంది.శివపార్వతులు నవమి రోజున శివుడిని తమ భర్తగా భావించి వివాహాన్ని పునరుద్ధరించుకునేందు కోసమే ఇక్కడికి వేల సంఖ్యలో తరలివస్తారు. శివపార్వతుల వివాహ సమయంలో వారి చేతుల్లోని త్రిశూలం గంటలమోతలు, కల్యాణ వేదిక ప్రాంగణమంతా వర్షపు జల్లుగా కురిసే తలంబ్రాలు, శివసత్తుల పూనకాలు అద్భుత దృశ్యాలు కనిపిస్తాయి. రుద్రాక్షలు మంగళసూత్రాలుగా, కాళ్లకు రాగిమట్టెలు, చేతికి త్రిశూలం ఇచ్చి వీరశైవులు వీరి పెళ్లి తంతును పూర్తి చేస్తారు.రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా సరే.. నవమి నాటికి జోగినిలు వేములవాడ చేరుకుంటారు. శివుడితో ధారణ పేరుతో తమ పెళ్లిళ్లు పునరుద్ధరించుకుంటారు. ఈ సంఖ్య లక్ష వరకు ఉండడం ఆశ్చర్యకరమైన విషయం. సీతారామ కల్యాణానికి ముందే శివపార్వతులు కొత్త దుస్తులు ధరించి, నుదుట పెద్ద బొట్టుతో, తలపై జీలకర్ర బెల్లం, చేతిలో త్రిశూలం, భుజానికి జోలె, అక్షింతలు పట్టుకొని శివుడితో వివాహానికి సిద్ధమవుతారు. ఇందులో వైవాహిక జీవితం గడుపుతున్న వారు కూడా ఉన్నారు. అనారోగ్య కారణాలు, జీవితంలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఇతరత్రా సమస్యలు తెలంగాణలో అనేక మందిని శివపార్వతులుగా మార్చడంలో దోహదపడుతున్నాయి. వేములవాడ దేవస్థానంలో శివపార్వతుల పెళ్లి తంతు వీరశైవులు నిర్వహిస్తారు.శివపార్వతులుగా మారేవారికి వీరశైవులు మెడలో రుద్రాక్షను మంగళసూత్రంగా వేస్తారు. కాళ్లకు రాగి మట్టెలు తొడిగి స్త్రీ, పురుష భేదం లేకుండా వారికి చీర కట్టిస్తారు. అనంతరం చేతికి త్రిశూలం ఇచ్చి శివుడితో పెళ్లి జరిపిస్తారు. దీంతో ఆయా స్త్రీ, పురుషులు శివపార్వతులుగా మారినట్టు భావిస్తారు. శివపార్వతులు కనీసం ఐదు ఇళ్లలో, శ్రావణమాసంలో కొన్ని వారాలపాటు భిక్షాటన చేస్తారు. శివుడిని పెళ్లి చేసుకున్న తరువాత శివుడి భార్యగానే కొనసాగుతున్న వారు ఉన్నారు. ఆర్థికంగా, సామాజికంగా మెరుగైన జీవనం గడుపుతున్న వారు, కుటుంబ జీవన వ్యవస్థలో కొనసాగుతున్న వారిలో కొందరు నవమి రోజు వేములవాడ వచ్చి ఈ ధారణ కార్యక్రమంలో పాల్గొంటారు.సీతారాముల కళ్యాణ శుభ ముహూర్తాన శివుడుని వివాహం చేసుకున్నట్లు భావించే శివపార్వతులు సాయంత్రం జరిగే శోభాయాత్ర లో హల్చల్ చేస్తారు. శివపార్వతులు జోగినిలు హిజ్రాలు డిజే సౌండ్స్ తో డప్పు నృత్యాలు చేస్తూ హంగామా సృష్టిస్తారు. రాత్రి పొద్దుపోయే వరకు ఆడి పాడిన శివపార్వతులు మరుసటి రోజు పోచమ్మకు బోనాల సమర్పించి విందు భోజనాలు ఆరగిస్తారు. శివుడిని వివాహం చేసుకున్న శివపార్వతులు రాజన్న సన్నిధిలో మొక్కులు చెల్లించి తిరుగు ప్రయాణం అవుతారు.మహిళలు, పురుషులే కాదు.. లోకజ్ఞానం తెలియని ఆడపిల్లను శివపార్వతులుగా మార్చే శివుడితో పెళ్లి తంతు ప్రక్రియ ధారణ పేరుతో వేములవాడ రాజన్న సన్నిధిలో ఏళ్ల తరబడి సాగిపోతూనే ఉంది. అటు ప్రభుత్వం, ఇటు పోలీసు యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు చిన్నారుల పెళ్ళికి అభ్యంతరాలు చెబుతున్నా, పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చిందే తప్ప.. ఆచారం మాత్రం యధావిధిగా కొనసాగుతూనే ఉంది. దైవభక్తితో సాగుతున్న వింత ఆచారం వికృత రూపం దాల్చకుండా ప్రభుత్వం పకడ్బంధీ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.



