- Advertisement -
వ్యూహాత్మక తప్పిదాలు… వైసీపీకి అస్త్రాలు
Strategic mistakes...weapons for YCP
అనంతపురం, ఫిబ్రవరి 5, (వాయిస్ టుడే)
ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మక తప్పిదాలకు పాల్పడుతోందా? విపక్షం వైసిపికి అస్త్రం అందిస్తోందా? ఆ పార్టీకి చేతినిండా పని చెబుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం చర్యలు పుణ్యమా అని.. వైసిపి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజల మధ్యకు వచ్చి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీకి కూటమి ప్రభుత్వం జేజేతులా అస్త్రాలు ఇస్తోంది. దీనిని సద్వినియోగం చేసుకుంటే మాత్రం వైసీపీకి ఎంతో ప్రయోజనం. ప్రజల్లో తిరిగి బలం పుంజుకునే అరుదైన అవకాశం. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతోంది. ప్రారంభంలో సజావుగా పాలన నడిచినట్లు కనిపించినా.. పాలనలో లోటుపాట్లు వెలుగు చూడడం ప్రారంభించాయి. సంకీర్ణ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకుంటున్న నిర్ణయాలు, చర్యలు కారణంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం నుంచి నేటి తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వరకు వ్యూహాత్మక తప్పిదాలు కనిపిస్తున్నాయి. ఇవి కచ్చితంగా ప్రజల్లోకి బలంగా వెళ్తాయని.. ప్రతికూలత చూపుతాయని కూటమి నేతలు సైతం ఆందోళన చెందుతున్నారు.
ముఖ్యంగా తిరుపతి వేదికగా జరిగిన పరిణామాలు కూటమి ప్రభుత్వ పాలనపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ప్రారంభంలో కూటమి ప్రభుత్వం పై సానుకూలత చూపినా.. తరువాత మాత్రం కూటమిపైనే విమర్శలు వచ్చేలా చేసింది. అటు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగింది. ఆరుగురు భక్తులు చనిపోయారు. తిరుమల చరిత్రలోనే అత్యంత విషాద ఘటన ఇది. ఈ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు వైఫల్యం చెందింది. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. టీటీడీలో సమన్వయ లోపం బయటపడింది.ఇప్పుడు తాజాగా తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికల్లో టిడిపి కూటమి ప్రవర్తన సైతం విమర్శలకు కారణమవుతోంది. వైసిపి కార్పొరేటర్లను బలవంతంగా తీసుకెళ్లడానికి కూడా ప్రయత్నం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యాన్ని టిడిపి కిడ్నాప్ చేసిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి ఇంట్లో ఉన్న ఆయనను కిడ్నాప్ చేశారని వైసీపీ నేతలు చెప్తున్నారు. కేవలం తిరుపతి డిప్యూటీ మేయర్ పదవిని కైవసం చేసుకునేందుకే ఈ దుశ్చర్యకు దిగారని ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే తప్పుల మీద తప్పులు చేస్తూ అనవసరంగా వైసీపీకి ఛాన్స్ ఇస్తున్నట్లు కూటమి నేతలే అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. మున్ముందు ఇలానే కొనసాగితే మాత్రం వైసీపీ నెత్తిన పాలు పోసినట్టే.
- Advertisement -