జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా
జగిత్యాల: జిల్లాలోని ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లను, ఆసుపత్రుల్లోని గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా వైద్య శాఖ అధికారులను ఆదేశించారు.మంగళవారం రాత్రి ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాల్ లో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం అమలు జిల్లా స్థాయి కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లలో నిరంతరం పర్యవేక్షణ, నిఘా పెంచి ఫాం “ఎఫ్” ఆడిట్ జరిపించాలని తెలిపారు.

గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. అలాగే గర్భిణిల వివరాలను ఖచ్చితంగా ఆన్ లైన్ పోర్టల్ లో నమోదు చేయాలని, ఈ రికార్డులను జిల్లా వైద్యాధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. కొత్త స్కానింగ్ సెంటర్లకు అనుమతి ఇచ్చే ముందు సంబంధిత ప్రమాణాలను పూర్తిగా తనిఖి చేసి జిల్లా కమిటి దృష్టికి తేవాలని, అదే విధంగా పాత ఆసుపత్రుల లైసెన్సులను రెన్యువల్ చేసే క్రమంలో వారు చట్ట రిత్యా చట్టానికి అనుగుణంగా ఆసుపత్రి నడుపుతున్న ఎడల మాత్రమే అనుమతులు మంజూరు చేయాలని, గడిచిన కాలంలో వారి ప్రవర్తనను బట్టి రెన్యువల్స్ చేయాలని కలెక్టర్ తెలిపారు.ఆనంతరం జిల్లా జడ్జి జి. నీలిమ మాట్లాడుతూ ప్రభుత్వ పరిధిలో ఉన్న స్కానింగ్ సెంటర్లు పకడ్బందీగా నిర్వహించినట్లయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో స్కానింగ్ లు వాటంతట అవే తగ్గిపోతాయని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్కానింగ్ సౌకర్యాలను మరింత మెరుగు పరిచి గర్భిణిలు అందరూ ప్రభుత్వ స్కానింగ్ సేన్తర్లోనే స్కానింగ్ చేయించుకునే విధంగా ప్రోత్సహించాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మరియు గర్భిణిలకు మర్యాద, స్నేహ పూర్వకమైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందుతున్న సేవలను తెలంగాణ డయాగ్నోస్టిక్స్, రేడియాలజీ, మేమోగ్రఫీ మొదలగు ఉచిత సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలలో, జిల్లాలోని కోర్టుల ఆవరణలో హెల్త్ క్యాంపులు నిర్వహించినట్లయితే అధికారుల ద్వారా ప్రజలకు ఉచిత వైద్య సేవలపై అవగాహన కలిగే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పారిశుధ్యం, పరిశుభ్రత మెరుగు పరుచుకోవాలని మరియు గ్రామాలలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆమె సూచించారు..ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి. శ్రీధర్, జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్. శ్రీనివాస్, జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఎం.డి.సమియోద్దిన్, డాక్టర్ ఎ. శ్రీనివాస్, జగిత్యాల, కొరుట్ల, మెట్ పల్లి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సెక్రటరీలు డాక్టర్ అజయ్ రెడ్డి, డాక్టర్ జగదీశ్వర్, డాక్టర్ ఆనంద్ బాబు, జాతీయ ఆరోగ్య మిషన్ జిల్లా అధికారి స్వామి, డెమో తులసి, రమణ పాల్గొన్నారు.



