దీపావళి కానుకగా అమల్లోకి సూపర్ సిక్స్ ఉచిత సిలిండర్ల పథకం
Super Six free cylinders scheme launched as a Diwali gift
దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
మొదటి విడతకు అయ్యే ఖర్చు రూ.894 కోట్ల మొత్తాన్ని పెట్రోలియం సంస్థలకు అందజేసిన సిఎం చంద్రబాబు
నిన్నటి నుంచి అమల్లోకి దీపం -2 పథకం
1వ తేదీన శ్రీకాకుళంలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
అమరావతి
సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. దీపం-2 పథకానికి రాష్ట్రం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్-6 హామీల్లో భాగంగా ఇచ్చిన యేడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పథకానికి ఖర్చయ్యే నిధులను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గ్యాస్ సరఫరా చేసే పెట్రోలియం సంస్థలకు అందజేశారు. బుధవారం సచివాలయంలోని మొదటి బ్లాక్ లో హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి ఈ సబ్సిడీ మొత్తాన్ని అందించారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అయ్యే రూ.2,684 కోట్ల ఖర్చుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ప్రభుత్వం పెట్రోలియం సంస్థలకు చెక్కు అందజేసింది. రూ.2,684 కోట్ల మంజూరుకు అంగీకారం తెలుపుతూ….మొదటి సిలిండర్ కు ఖర్చు అయ్యే రూ.894 కోట్లు పెట్రోలియం సంస్థలకు అందించింది. దీపం-2 పథకంలో భాగంగా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ప్రభుత్వం పేద ప్రజలకు అందించనుంది. యేడాదికి మూడు విడతల్లో ప్రభుత్వం మూడు గ్యాస్ సిలిండర్లకు అయ్యే ఖర్చు సొమ్మును విడుదల చేయనుంది. 29వ తేదీ నుంచి ప్రభుత్వం ఈ పథకం కింద గ్యాస్ బుక్ చేసుకునే అవకాశాన్నిలబ్దిదారులకు కల్పించింది. గ్యాస్ సిలిండర్ అందిన 48 గంటల్లో లబ్ధిదారులు సిలిండర్ కు వెచ్చించిన సొమ్ము వారి ఖాతాలో జమ కానుంది. కేంద్రం ఇచ్చే రూ.25ల రాయితీ పోను మిగిలిన రూ.876లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం అమలుకు ప్రతియేటా రూ.2,684 కోట్లు ప్రభుత్వంపై ఆర్థిక భారం పడనుంది. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు తెనాలి నుంచి వచ్చిన దీపం పథకం లబ్దిదారు బాలమ్మ, ఏలూరు నుంచి వచ్చిన లబ్దిదారు భవానీ, విజయవాడ నుంచి వచ్చిన లబ్దిదారు మంగతాయారు, సివిల్ సప్లై శాఖ అధికారులు, పెట్రోలియం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.