కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు తీర్పురేవంత్ ప్రభుత్వానికి చెంపపెట్టు
మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు
హైదరాబాద్ ఏప్రిల్ 16
Supreme Court verdict on Kancha Gachibowli lands is a slap in the face to the Revanth government: MLA Harish Rao
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్వాగతించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన, చేయబోతున్న పర్యావరణ విధ్వంసం ఎంత భయంకరమైందో సుప్రీం కోర్టులో జరిగిన వాదనల వల్ల ప్రపంచానికి తేటతెల్లమైంది అని హరీశ్‌రావు పేర్కొన్నారు.బాధ్యత గల ప్రభుత్వం, కావాలనే సెలవు దినాల్లో బుల్‌డోజర్లతో విధ్వంసానికి పాల్పడటంపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు. విధ్వంసం చేసిన వంద ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని నిలదీయడం ఆహ్వానించదగ్గ పరిణామం. కంచె గచ్చిబౌలి భూములను, పర్యావరణాన్ని కబళించాలని చూసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ తన రిపోర్టుతో కళ్లు తెరిపించింది అని హరీశ్‌రావు తెలిపారు.అధికారం ఉంది కదా అని ఇష్టారీతిగా వ్యవహరిస్తే సభ్య సమాజం, న్యాయ వ్యవస్థ చూస్తూ ఊరుకోవని.. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ముందుకు వస్తాయని గతంలోనూ అనేక సార్లు నిరూపనైంది. ఈరోజు కూడా అదే జరిగింది. విధ్వంసమే విధానంగా సాగుతున్నది రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన.. నాడు హైడ్రా పేరుతో ఇండ్లు కూల్చి అరాచకం. నేడు బుల్‌డోజర్లతో పర్యావరణ హననం. మాకు న్యాయస్థానాల మీద ఎంతో గౌరవం ఉంది. అందుకే బాధ్యతగా బిఆర్ఎస్ పార్టీ తరుపున సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి నివేదిక ఇచ్చాం. ఆధారాలతో సహా వాస్తవాలు వివరించాం. వృక్షో రక్షతి రక్షిత అని పెద్దలంటే, వృక్షో భక్షతి అన్నట్లుగా తయారైన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర ప్రజలందరూ ఏకం కావాలి అని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.