ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోండి..ఏడిఈ రవికాంత్ చౌదరి
Take advantage of Prime Minister's Surya Ghar Yojana scheme-ADE Ravikant Chaudharyరుద్రవరం
నియోజకవర్గంలోని ప్రతి విద్యుత్ వినియోగదారుడు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆళ్లగడ్డ ట్రాన్స్ కో ఏడిఈ రవికాంత్ చౌదరి అన్నారు. బుధవారం రుద్రవరంలోని విద్యుత్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు ఉచిత కరెంటు అందించే ఉద్దేశంతో ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను ప్రారంభించిందన్నారు. సొంత ఇల్లు కలిగిన ప్రతి విద్యుత్ వినియోగదారుడు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటి పైకప్పులపై సౌర పలకాలను ఏర్పాటు చేసుకొని విద్యుత్ ను ఆదా చేసుకోవాలన్నారు. సౌర విద్యుత్ వాడడం వల్ల 300 యూనిట్ల వరకు విద్యుత్ ఛార్జీలు మినహాయింపు ఉంటుందన్నారు. ఈ పథకం 2023-24 సంవత్సరం నుండి 2026-2027 వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే పీఎం సూర్య ఘర్ యోజన స్కీం అఫీషియల్ వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోవాలన్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఇల్లు దరఖాస్తుదారుని పేరు మీద ఉండాలని, విద్యుత్ కనెక్షన్ దరఖాస్తు దారుని పేరు మీదనే ఉండాలన్నారు. ఈ స్కీములో భాగంగా ద్వారా ఇంటిపై ఏర్పాటు చేసుకునే సోలార్ సిస్టం ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో మొదటి 300 యూనిట్లు లబ్ధిదారులు ఉచితంగా వాడుకోవచ్చని మిగిలిన 600 యూనిట్ లను నెట్ మీటరింగ్ ద్వారా అమ్ముకోవచ్చన్నారు. మూడు కిలోవాట్ల సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడానికి 1.45 లక్షలు ఖర్చు అవుతుందని 78 వేల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందన్నారు. ఒక కిలో వాట్ నుండి 10 కిలో వాట్ల వరకు సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం మాత్రం మూడు కిలోవాట్లకు మించి చేసుకున్న సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న గరిష్టంగా 78,000 మాత్రమే సబ్సిడీ వినియోగదారునికి చెల్లించడం జరుగుతుందన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం లోని సిరివెళ్ల మండలం గోవింద పల్లె గ్రామాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం సూర్య ఘర్ యోజన పథకం కింద ఎంపిక చేసిందన్నారు. సొంత గృహం కలిగిన ప్రతి విద్యుత్ వినియోగదారుడు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. దరఖాస్తు ఫీజు ఉచితమని పూర్తి వివరాల కోసం దగ్గరలో ఉన్న విద్యుత్ కార్యాలయ అధికారులను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఏఈ రాజశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు.




