రీ సర్వే చేస్తున్న టీడీపీ
గుంటూరు, జనవరి 27,
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ సిద్దమవుతుంది. మిత్రపక్షం జనసేనతో కలిసి ఎన్నికల బరిలో దిగేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల సభలు నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. రా…కదలిరా పేరుతో నిర్వహిస్తున్న ఈ సభలకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ గ్యాప్‌లో పార్టీకి సంబంధించిన ఇతర అంశాలపై చంద్రబాబు కసరత్తు చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి చంద్రబాబు ఎక్కువగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే జనసేనతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన తర్వాత అభ్యర్ధుల జాబితా ప్రకటించాలని మొదట్లో అనుకున్నారు. సంక్రాంతి రోజు మొదటి విడత అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. సుమారు 35 నుంచి 40 స్థానాలకు సంబంధించిన అభ్యర్ధులతో జాబితా విడుదల చేస్తారని తెలిపారు. అయితే అదికాస్తా వాయిదా పడింది. భోగి పండుగకు ఒకరోజు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు చంద్రబాబు. ఇరువురు నేతలు సుమారు మూడు గంటలపాటు చర్చించారు. ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు అభ్యర్ధుల ఎంపికపైనే ఎక్కువగా చర్చ జరిగినట్లు తెలిసింది. ఆ తర్వాత టీడీపీ ఒక్కటే కాకుండా టీడీపీ అభ్యర్ధులతో పాటు పదిమంది జనసేన అభ్యర్ధులను కూడా ప్రకటిస్తారని.. ఇద్దరు నేతలు ఒకేరోజు ఈ ప్రకటన చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. చివరకు ఇది కూడా వాయిదా పడుతూ వచ్చింది. తాజగా టీడీపీ-జనసేన మొదటి విడత అభ్యర్ధల జాబితా విడుదల మరింత ఆలస్యం అవుతుందని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.తెలుగుదేశం పార్టీ మొదటి విడత అభ్యర్ధుల ప్రకటన మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీనికి పలు కారణాలున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీతో పాటు జనసేనలోకి ఇతర పార్టీల నుంచి ఎక్కువ మంది నేతలు వచ్చి చేరుతుండటంతో పాటు ఒక్కో స్థానంలో అభ్యర్ధులు కూడా ఎక్కువగా ఉండటం కారణంగా తెలుస్తోంది. కొన్ని స్థానాల్లో టీడీపీతో పాటు జనసేన అభ్యర్దులు కూడా రేసులో ఉండటంతో పాటు మరికొన్ని స్థానాల్లో టీడీపీ ఆశావహులు ఒకరికంటే ఎక్కవగా ఉండటం కూడా పార్టీకి ఇబ్బందిగా మారింది. దీంతో తెలుగుదేశం ఆశావహులు ఎక్కువగా ఉన్నచోట్ల చంద్రబాబు తిరిగి రీ సర్వేలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇంచార్జిలు ఉన్నచోట కూడా టిక్కెట్లు ఆశించేవారు ఎక్కువగా ఉంటే వారిలో ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్ధులపై ఐవీఆర్ ఎస్ సర్వే చేయిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలతో పాటు ప్రజల్లో ఎవరి మీద ఎక్కువ అభిమానం ఉంది, ఎవరికి మద్దతు ఎక్కువగా ఉందో అలాంటి వారిని ఎంపిక చేసేందుకు ఈ సర్వేలు నిర్వహిస్తున్నారని తెలిసింది. ఇలా చేసి అభ్యర్ధులను ఎంపిక చేయడం ద్వారా రెండో అభ్యర్ధి నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ పార్టీకి పెద్దగా నష్టం ఉండదని అనుకుంటున్నారట. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిల మార్పు కూడా టీడీపీ జాబితా ఆలస్యానికి కారణం అని అంటున్నారు. సామాజిక సమీకరణాల ప్రకారం వైసీపీ ప్రకటించిన స్థానాల్లో అదే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చేలా మార్పులు చేయాల్సి వస్తుందని అంటున్నారు. దీని ప్రకారం ముందుగా అనుకున్న కొన్ని స్థానాల్లో సామాజిక సమీకరణాల ప్రకారం అభ్యర్ధులను మారుస్తున్నారని తెలిసింది. ఈ కారణాలతో నే టీడీపీ జాబితా ఆలస్యం అవుతుంది. ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో టీడీపీ-జనసేన జాబితా విడుదల చేసేలా రెండు పార్టీల నేతలు ముందుకెళ్తున్నట్లు తెలిసింది.
రీ సర్వే చేస్తున్న టీడీపీ
- Advertisement -
- Advertisement -