కంచె గచ్చిబౌలి భూములపై జోక్యం చేసుకోండి,
కేంద్ర మంత్రిని కోరిన తెలంగాణ బీజేపీ ఎంపీలు
Telangana BJP MPs request Union Minister to intervene in Kanche Gachibowli lands
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1
రంగారెడ్డి జిల్లాలోని కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములపై రాజకీయంగా దుమారం రేగుతోంది. హెచ్‌సీయూ భూములు అని, అటవీ భూములు అని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఆ భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని తెలంగాణ బీజేపీ ఎంపీలు కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కంచె గచ్చిబౌలి భూములపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్, తెలంగాణ బీజేపీ ఎంపీలు కలిశారు.కంచె గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా తెలంగాణ బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, నగేశ్ లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను కోరారు. పర్యావరణ, హెరిటేజ్ భూములను రక్షించాలని కోరారు. హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణ సమతుల్యతకు కంచె గచ్చిబౌలి భూములు ఎంతో ప్రయోజనకరం. దాదాపు 700 రకాల ఔషధ మొక్కలు, 220 రకాల పక్షులతో ఆ ప్రాంతమంతా అలరారుతోందని చెప్పారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ భూములను రియల్ ఎస్టేట్ గా మార్చి వేల కోట్లు దండుకోవాలని చూస్తోందని ఆరోపించారు. హెచ్ సీయూ విద్యార్థులతోపాటు యావత్ హైదరాబాద్ ప్రజలంతా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని కేంద్ర మంత్రికి తెలిపారు. తక్షణమే గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రికి రాష్ట్ర బీజేపీ ఎంపీలు వినతిపత్రం ఇచ్చారు.