తన వాగ్దానాలను నిలుపుకోలేకపోయిన సీఎం కేసీఆర్
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్
హైదరాబాద్ నవంబర్ 25: బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్తో సహా మిగతా అనేక రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే, బీఆర్ఎస్ పార్టీ పదేళ్లుగా అధికారంలో ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధిపరంగా వెనుకబడిపోయిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రా రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. దేశ ప్రజలకు బీజేపీ ఇచ్చిన హామీలు కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం, త్రిబుల్ తలాఖ్ రద్దులను అమలు చేయగలిగామని, కానీ తెలంగాణాలో సీఎం కేసీఆర్ పదేళ్లుగా ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను మాత్రం నెరవేర్పలేక చతికిల పడ్డారని ధ్వజమెత్తారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కార్వాన్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీ అమర్సింగ్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ కార్వాన్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. ప్రత్యేక వాహనంలో కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్, అమర్సింగ్ లు ఓటర్లకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. గుడిమల్కాపూర్ చౌరస్తా వద్ద ప్రారంభమైన రోడ్ కార్వాన్ దర్బార్ మైసమ్మ దేవాలయం, మహాంకాళి దేవాలయం, పంచ్బాయీలావా చౌరస్తా, జియాగూడ మెయిన్ రోడ్డు, భీమ్నగర్ చౌరస్తా, జియాగూడ 2బీహెచ్కె కాలనీ మీదుగా సంజయ్ నగర్ వరకూ కొనసాగింది. సంజయ్ నగర్లో బహిరంగ సభ నిర్వహించారు. రోడ్ షోలో భాగంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా రాజ్నాధ్సింగ్, అమర్సింగ్ రోడ్పోకు ఘనస్వాగతం లభించింది. వేలాది కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో కదిలివస్తున్న ర్యాలీకి గుడిమల్కాపూర్, కార్వాన్, జియాగూడ ప్రాంతాలలో వాడ వాడలా ప్రజలు ప్రత్యేక స్వాగత వేదికలు ఏర్పాటుచేసి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ అమర్సింగ్ను అత్యధిక మెజార్టీతో ఎన్నికల్లో గెలిపించి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. భాజపా కార్వాన్ ఎమ్మెల్యే అభ్యర్థి టి అమర్సింగ్ మాట్లాడుతూ రజాకార్ల పార్టీ మజ్లిస్ తో కుమ్మక్కైన అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓట్లు చీల్చి తనను ఓడించి మజ్లిస్ ను గెలిపించేందుకే కార్వాన్లో ఆ పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థులను నిలిపిందని ఆరోపించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రోడోను దృష్టిలో ఉంచుకొని గుడిమల్కాపూర్, టప్పాచబుత్ర, కుల్సుంపురా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించారు.