హైదరాబాద్‌లో 111 మెడికల్ షాపులపై టీజీ సేఫ్ కొరడా
అక్రమంగా నియంత్రిత మందుల విక్రయాలపై ప్రత్యేక తనిఖీలు
TG SAFE cracks the whip on 111 medical shops in Hyderabad.
హైదరాబాద్, అక్టోబర్ 07 (వాయిస్ టుడే): హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మెడికల్ షాపులపై టీజీ సేఫ్ డ్రగ్స్ వింగ్ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అక్టోబర్ 6న చార్మినార్, మెహదీపట్నం, టోలిచౌకి, మలక్‌పేట, గోషామహల్ ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టారు.
ట్రామడాల్, టాపెంటడాల్, నైట్రాజెపామ్, ప్రెగాబాలిన్, జోల్పిడెమ్, అల్ప్రాజోలం, కోడైన్ ఆధారిత దగ్గు సిరప్‌ల అక్రమ విక్రయాలు, మళ్లింపుపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.
తనిఖీల్లో మొత్తం 111 మెడికల్ షాపుల్లో అవకతవకలు గుర్తించినట్లు టీజీ సేఫ్ డ్రగ్స్ వింగ్ తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా మందుల విక్రయం, నిల్వ లేదా మళ్లింపుకు సంబంధించిన అంశాలపై అధికారులు వివరాలను పరిశీలించారు.
అవకతవకలు గుర్తించిన సంబంధిత మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. నిబంధనల ఉల్లంఘన తీవ్రతను బట్టి డ్రగ్ లైసెన్సుల సస్పెన్షన్ లేదా రద్దు వరకు చర్యలు తీసుకునే అవకాశం ఉందని టీజీ సేఫ్ స్పష్టం చేసింది.
నియంత్రిత మందుల అక్రమ విక్రయాలు, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.




