దటీజ్ రేవంత్
హైదరాబాద్, మార్చి 6, (వాయిస్ టుడే)
That’s Revanth
తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన రాజకీయ చాణక్యాన్ని, అధిష్టానం వద్ద తనకున్న తిరుగులేని పట్టును నిరూపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వంటి మహా సముద్రంలో ఎందరో సీనియర్
తిమింగలాల ఎత్తుగడలను చిత్తు చేస్తూ, తన అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ బెర్త్ ఖరారు చేయించుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఇది కేవలం ఒక సీటు కేటాయింపు మాత్రమే కాదు, ఢిల్లీ
పీఠంపై రేవంత్ ముద్ర ఏ స్థాయిలో ఉందో చాటిచెప్పే పరిణామం.కాంగ్రెస్ పార్టీలో ఒక సామెత ఉంది – “ఢిల్లీలో చక్రం తిప్పడం అందరికీ సాధ్యం కాదు” అని. కానీ రేవంత్ రెడ్డి ఆ సామెతను తిరగరాస్తున్నారు. తాజాగా
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో రేవంత్ రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకోవడం ద్వారా పార్టీలో తనదే ‘పైచేయి’ అని స్పష్టం చేశారు. దాదాపు 16 మంది సీనియర్ నేతలు రాజ్యసభ రేసులో పోటీ పడినా, అంతిమంగా
ముఖ్యమంత్రి తన మిత్రుడు వేం నరేందర్ రెడ్డి వైపే అధిష్టానాన్ని మొగ్గు చూపేలా చేయగలిగారు.వి. హనుమంతరావు, జీవన్ రెడ్డి, కుసుమ కుమార్ వంటి హేమాహేమీలు ఈ సీటు కోసం తీవ్రంగా శ్రమించారు. వర్కింగ్
ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లి కుసుమ కుమార్ లేదా వీహెచ్ పేర్లను ప్రతిపాదించి చక్రం తిప్పాలని చూశారు. మరోవైపు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దరఖాస్తుల కట్టలతో అధిష్టానం చుట్టూ తిరిగారు.
కానీ, రేవంత్ రెడ్డి వ్యూహం ముందు ఇవేవీ పారలేదు. ఇటీవల రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ విషయంపై దాటవేత ధోరణి ప్రదర్శించడం వెనుక ఉన్న మర్మం.. రేవంత్ రెడ్డితో చర్చించాకే తుది నిర్ణయం
తీసుకోవాలనే సంకేతమే అని ఇప్పుడు స్పష్టమవుతోంది.వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డిల స్నేహం దశాబ్దాల నాటిది. జడ్పీటీసీ స్థాయి నుంచి మొదలైన వీరి ప్రస్థానం టీడీపీ, బీఆర్ఎస్ మీదుగా కాంగ్రెస్ వరకు
కొనసాగింది. రేవంత్ రెడ్డి కష్టాల్లో ఉన్నప్పుడు, రాజకీయ సంక్షోభాల్లో ఉన్నప్పుడు నరేందర్ రెడ్డి వెన్నుదన్నుగా నిలిచారు. ప్రస్తుతం సీఎం పేషీలో కీలక వ్యక్తిగా, ప్రభుత్వ సలహాదారుగా ఉన్న నరేందర్ రెడ్డిని ఢిల్లీకి
పంపడం ద్వారా, అక్కడ తనకంటూ ఒక నమ్మకస్తుడైన ప్రతినిధి ఉండాలని రేవంత్ భావించారు. ప్రభుత్వానికి సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేయించుకోవడానికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుంది.ఈ
పరిణామాన్ని దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలంతో పోలిస్తే రేవంత్ వేగం ఆశ్చర్యపరుస్తుంది. వైఎస్సార్ తన ఆత్మబంధువు కేవీపీ రామచంద్రరావుకు రాజ్యసభ సీటు ఇప్పించుకోవడానికి ఐదేళ్లు వేచి చూడాల్సి
వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల లోపే తన మిత్రుడిని రాజ్యసభకు పంపగలిగారు. నాడు కేంద్రంలో కాంగ్రెస్ బలంగా ఉండటం వల్ల వైఎస్సార్‌కు కొంత పరిమితులు ఉండేవి, కానీ నేడు
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తరుణంలో.. తెలంగాణ లాంటి రాష్ట్రం నుంచి పార్టీని బలోపేతం చేస్తున్న రేవంత్ మాటకు అధిష్టానం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.ఇటీవల ఏఐ డీప్ ఫేక్ వీడియోల ద్వారా
రేవంత్ రెడ్డిని అధిష్టానం దూరం పెడుతోందని, ఖర్గే ఆయన్ని దగ్గరకు రానివ్వడం లేదని జరిగిన దుష్ప్రచారానికి ఈ నిర్ణయం ఒక గట్టి సమాధానం. ఢిల్లీలో ఒక సీటునుఅభిషేక్ మను సింఘ్వి వంటి మేధావికి కేటాయించి,
మరో సీటును తన మిత్రుడికి దక్కించుకోవడం ద్వారా రేవంత్ తన బలాన్ని నిరూపించుకున్నారు.వరుసగా వచ్చే రాష్ట్రాల ఎన్నికలు, ముఖ్యంగా కేరళ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నుంచి అందుతున్న సహకారం,
రేవంత్ పనితీరు పట్ల రాహుల్ గాంధీకి ఉన్న నమ్మకం వెరసి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ కింగ్ గా మార్చాయి. ఎన్ని ఫిర్యాదులు, ఎంతమంది సీనియర్ల అసంతృప్తులు ఉన్నా.. విజేతగా నిలవడం రేవంత్ స్టైల్ అని మరోసారి
రుజువైంది.



