హైదరాబాద్, నవంబర్ 8, (వాయిస్ టుడే ): 2018 ఎన్నికల్లో కమ్యూనిస్టుల పొత్తు వల్లే ఎమ్మెల్యేగా గెలిచానని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. చండూర్‌లో సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్‌ను గద్దె దింపడం బీజేపీ పార్టీ మోడీ నాయకత్వంతో సాధ్యం అనే నమ్మకంతో పార్టీ మారానని ఈ సందర్భంగా చెప్పారు. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను చేతిలో పెట్టుకొని లిక్కర్ కుంభకోణంలో కవితను అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయన్నారు. తన లక్ష్యం కేసీఆర్‌ను గద్దె దింపడమేనని, అది బీజేపీతో సాధ్యం కాలేదన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుంది, కేసీఆర్ గద్దె దింపడం కాంగ్రెస్‌తోనే సాధ్యమని తిరిగి సొంత పార్టీకి వచ్చానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు ఉపఎన్నికల్లో కమ్యూనిస్టుల వల్లే బీఆర్ఎస్ గెలిచిందన్నారు. పేదల పార్టీ, ఆత్మగౌరవంతో పని చేసే నాయకులు కమ్యూనిస్టులు అంటూ పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో మీ లక్ష్యం బీజేపీ ఓటమి, రాజగోపాల్ రెడ్డి మీద శత్రుత్వం కాదని తెలిసిపోయిందని సీపీఐ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.