మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్
హైదరాబాద్ నవంబర్ 2: కాళేశ్వరం పేరు చెప్పుకొని బీఆర్ఎస్ పార్టీ ఓట్లు దండుకుంటుందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ అన్నారు. గురువారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…రోజురోజుకీ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. రాహుల్‌గాంధీ కాళేశ్వరం సందర్శన వెళ్లిన తర్వాత అనేక నిజాలు బయటపడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఏం లాగా ఉపయోగపడుతోంది. కమీషన్ల కోసం కాళేశ్వరం అంచనాలను పెంచారు. కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరంగా మార్చింది. కాళేశ్వరంపై విమర్శలు చేస్తున్న బీజేపీ ఎలాంటి విచారణ చేయడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌లో లోపాలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వృథా చేసిన సొమ్ము తెలంగాణ ప్రజలపై అప్పుగా మారింది. కాళేశ్వరం డబ్బులు ఎక్కడ పోయాయి. రైతుల కోసం నీళ్లు ఇవ్వడానికి అని చెప్తూ అన్నివర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారు. తెలంగాణలో మేం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తాం. ఇచ్చిన మాటని నిలబెట్టుకునే ట్రాక్ రికార్డ్ కాంగ్రెస్ పార్టీకి ఉంది’’ అని అశోక్ చౌహాన్ పేర్కొన్నారు.



