హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో ఎన్నికల నిర్వహణలో భాగంగా చేసే బదిలీల్లో మొదటిసారి ఆబ్కారీశాఖను చేర్చడం ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా ఎన్నికల విధులతో సంబంధం ఉండే రెవెన్యూ, పురపాలక, పోలీసు తదితర ప్రభుత్వ శాఖల అధికారులనే మార్చుతుంటారు. ఇప్పుడు కొత్తగా ఆబ్కారీ అధికారులను కూడా ఇందులో చేర్చారు. ఇటీవలే శాసనసభ ఎన్నికల సందర్భంగా అనేక మంది బదిలీ అయ్యారు. వారిలో చాలామంది తిరిగి తాము పనిచేసిన ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా పోలీసుశాఖలో పెద్దఎత్తున స్థానచలనాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ శాఖపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే అనేక మంది ఉన్నతాధికారులను మార్చింది. పోలీస్‌స్టేషన్ స్థాయి నుంచి ఎస్పీలు, కమిషనర్లను కూడా బదిలీ చేయాలని భావిస్తోంది. వాస్తవానికి రెండు మూడు రోజుల్లో ఎస్పీలు, డీఎస్పీలు.. ఆ తర్వాత సీఐ, ఎస్సైల బదిలీలు ఉండొచ్చని భావించారు. ఈలోపే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎవరెవరు ఎక్కడికి బదిలీ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. నిబంధనల మేరకు సొంత జిల్లాల్లో పనిచేస్తున్న వారిని, నాలుగేళ్ల కాలంలో వరుసగా మూడేళ్లు ఒకేచోట పనిచేస్తున్న వారిని బదిలీ చేయాల్సి ఉంటుంది.
ఆరేళ్ల తరువాత ఆబ్కారీలో
వాస్తవానికి రెండేళ్లకు ఒకసారి బదిలీలు జరుగుతుంటాయి. ఆబ్కారీశాఖలో మాత్రం ఆరేళ్లుగా చేపట్టలేదు. చాలామంది ఏళ్ల తరబడి ఒకే దగ్గర పనిచేస్తున్నారు. మూడేళ్లుగా ఒకే దగ్గర పనిచేస్తున్న వారిని మార్చాలన్న నిబంధన నేపథ్యంలో ఈ శాఖలో భారీ మార్పులు జరగనున్నాయి..