నిజామాబాద్, నవంబర్ 15, (వాయిస్ టుడే ): జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో అనూహ్యమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడి నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ సంజయ్ తన తండ్రి విద్యాసాగర్ రావు రాజకీయాల నుండి తప్పుకోవడంతో బరిలో నిలిచారు. కొంతకాలంగా నియోజకవర్గ ప్రజలతో టచ్ లో ఉంటూ పర్సనల్ ఇమేజ్ పెంచుకుంటూ వచ్చిన సంజయ్, మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు కావడం విశేషం. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రమైన అనారోగ్యానికి గురైనప్పుడు కూడా ఆయనను సేఫ్ చేశారని కూడా పేరుంది. తొలిసారి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన డాక్టర్ సంజయ్ తొలి ప్రయత్నంలోనే చట్టసభలోకి అడుగు పెట్టాలన్న ఉత్సుకతతో ముందుకు సాగుతున్నారు.ఇక కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే.. బుగ్గారం ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన జువ్వాడి రత్నాకర్ రావు తనయుడు నర్సింగరావు మరోసారి కోరుట్ల బరిలో నిలుస్తున్నారు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన నర్సింగరావు, గత ఎన్నికల్లోనూ ఇక్కడి నుండి పోటీ చేసినప్పటికీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో తండ్రి రత్నాకర్ రావు ప్రత్యర్ధి కల్వకుంట్ల విద్యాసాగర్ రావుతో పోటీ పడగా, ఈ సారి మాత్రం తనయుడు డాక్టర్ సంజయ్ తో అమి తుమీ తేల్చుకోవాలని చూస్తున్నారు నర్సింగరావు.ఇకపోతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. తండ్రి సీనియర్ రాజకీయ నేత డి. శ్రీనివాస్ తనయుడు. ఉమ్మడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన విధాన సభ, పరిషత్తుతో పాటు రాజ్యసభలకు ప్రాతినిథ్యం వహించారు డీఎస్. ఆయన వారసత్వాన్ని అందుకుని 2019 లోకసభ ఎన్నికల్లోనే నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. తొలి ప్రయత్నంలోనే సీఎం కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితపై పోటీ చేసి సంచలన విజయం అందుకున్నారు. తాజాగా జరుతున్న ఎన్నికల్లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న లోకసభ పరిధిలోనే ఉన్న కోరుట్ల నుండి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.ప్రత్యక్ష రాజకీయాల్లో తలపండిన కుటుంబాలకు చెందిన ముగ్గురు కూడా కోరుట్ల నుండి పోటీ చేస్తుండడం విశేషం. పాలిటిక్స్ లో ఎత్తులు పై ఎత్తులు వేయడంలో ఆరితేరిన ఫ్యామిలీస్ కు చెందిన ముగ్గురు కూడా కోరుట్ల ఓటర్లను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారోనన్నదే తేలాల్సి ఉంది. ఏ అభ్యర్థి ఇక్కడి ఓటర్ల మనసులు గెల్చుకుని అసెంబ్లీలోకి అడుగుపెడ్తారోనన్నది తెలియాలంటే మాత్రం డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే..!