ప్రజా ప్రయోజనాలకు మీడియాలో ప్రాధాన్యత తగ్గుతోంది

- Advertisement -

ప్రజా ప్రయోజనాలకు మీడియాలో ప్రాధాన్యత తగ్గుతోంది

The emphasis on public interest in the media is declining.

The emphasis on public interest in the media is declining.
The emphasis on public interest in the media is declining.
The emphasis on public interest in the media is declining.
The emphasis on public interest in the media is declining.

రాజకీయ పార్టీలకు అనుబంధంగా మారుతున్న కొన్ని మీడియా సంస్థలు.. రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం 

హైదరాబాద్‌: పత్రికలు, టెలివిజన్‌ చానళ్లు సమాజ శ్రేయస్సు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడం తగ్గిపోతోందని శాసనమండలి సభ్యుడు ప్రొఫెసర్‌ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన స్రవంతిలోని కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అనుబంధంగా మారడంతో ప్రజా ప్రయోజనాలకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్నారు. స్వతంత్ర జర్నలిజం, ప్రజా సమస్యలపై నిష్పక్షపాత కథనాలు నేటి సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు.

జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మీడియా అకాడమీ, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నాంపల్లిలోని మీడియా అకాడమీ భవన్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. మీడియా అకాడమీ చైర్మన్‌ కె. శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కోదండరాం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రవీష్‌ వంటి స్వతంత్ర జర్నలిస్టులు, ‘ది వైర్‌’ వంటి సంస్థలు ప్రజా సమస్యలను ధైర్యంగా వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు.

జర్నలిస్టులపై తీవ్ర ఒత్తిళ్లు: ప్రొఫెసర్‌ హరగోపాల్‌

ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం జర్నలిస్టులు స్వేచ్ఛగా, స్వతంత్రంగా పనిచేసే పరిస్థితులు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విలేకరుల నుంచి సంపాదకుల వరకు వివిధ స్థాయిల్లో ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పెద్దలకు ఇబ్బంది కలిగించే విమర్శనాత్మక కథనాలు ప్రచురితమైతే, వాటిని రాసిన జర్నలిస్టులపై చర్యలు తీసుకోవడానికి మీడియా యాజమాన్యాలు కూడా వెనుకాడటం లేదని అన్నారు. ఒత్తిళ్ల మధ్య ప్రమాదంలో పడుతున్న పత్రికా వ్యవస్థను పరిరక్షించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

సోషల్‌ మీడియా ప్రభావం పెరుగుతోంది: పద్మజా షా

ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం మాజీ అధిపతి ప్రొఫెసర్‌ పద్మజా షా మాట్లాడుతూ.. డిజిటల్‌, సోషల్‌ మీడియా విస్తరణతో వార్తల వినియోగ విధానంలో గణనీయమైన మార్పులు వస్తున్నాయని తెలిపారు. పత్రికలు, టెలివిజన్‌ చానళ్లపై ఆధారపడే వారి సంఖ్య తగ్గుతోందని పేర్కొన్నారు. రాయిటర్స్‌ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం 58 శాతం మంది వార్తల కోసం సోషల్‌ మీడియాను ఎంచుకుంటున్నారని వివరించారు. ఫేస్‌బుక్‌, ఎక్స్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి వేదికల్లో ప్రభుత్వాలకు నచ్చని వార్తలు, కథనాలను తొలగించేందుకు ఆయా సంస్థలపై ఒత్తిళ్లు వస్తున్నాయని ఆమె ఆరోపించారు.

కార్పొరేట్‌ చేతుల్లో ప్రధాన స్రవంతి మీడియా: వేణుగోపాల్‌

‘వీక్షణం’ సంపాదకులు ఎన్‌. వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. సమాజం ఎదుర్కొంటున్న అనేక కీలక సమస్యలను పక్కనపెట్టి, జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అప్రధానమైన అంశాన్ని చర్చకు ఎంచుకోవడం విచారకరమన్నారు. ప్రధాన స్రవంతి మీడియా కార్పొరేట్‌ సంస్థల ప్రభావంలోకి వెళ్లిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలోని అనేక ప్రధాన పత్రికలపై కేంద్ర ప్రభుత్వం ప్రభావం చూపుతోందని విమర్శించారు.

వాస్తవాలు, విలువలే జర్నలిజానికి పునాది: విరాహత్‌ అలీ

టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కె. విరాహత్‌ అలీ మాట్లాడుతూ.. జర్నలిజం ప్రజలను ఆకర్షించడానికా? సమాజం పట్ల బాధ్యతను నిర్వర్తించడానికా? అనే చర్చ నేడు ప్రాధాన్యత సంతరించుకుందని అన్నారు. పాఠకులు, వీక్షకుల సంఖ్య పెంచుకునేందుకు సంచలనాత్మక శీర్షికలు, అర్థసత్యాలు, వ్యక్తిగత ఆరోపణలు, నిర్ధారణ కాని వార్తల ప్రచురణకు కొన్ని సంస్థలు ప్రాధాన్యత ఇస్తున్నాయని విమర్శించారు. ఇలాంటి ధోరణులు తాత్కాలిక ఆదరణ పొందవచ్చుగానీ సమాజానికి మేలు చేయవని పేర్కొన్నారు. మీడియా ప్రజాకర్షకంగా ఉండటంలో తప్పులేదని, అయితే ఆ క్రమంలో వాస్తవాలు, విలువలు, నైతిక ప్రమాణాలు బలికాకూడదని సూచించారు.

పత్రికా స్వేచ్ఛ, నైతిక ప్రమాణాల పరిరక్షణ కోసం ఆరు దశాబ్దాల క్రితం ఏర్పాటైన ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా స్వతంత్రంగా వ్యవహరించాలని, పాలకుల ప్రభావానికి లోనుకాకూడదని విరాహత్‌ అలీ అభిప్రాయపడ్డారు.

పలువురు ప్రముఖుల పాల్గొనడం

ఈ సమావేశంలో ప్రముఖ పాత్రికేయులు డాక్టర్‌ కె. రాంచంద్రమూర్తి, ‘సియాసత్‌’ పత్రిక మేనేజింగ్‌ ఎడిటర్‌ అమెర్‌ అలీఖాన్‌, సీనియర్‌ పాత్రికేయులు నాగసూరి వేణుగోపాల్‌, మల్లేపల్లి లక్ష్మయ్య, నిమ్స్‌ ఆసుపత్రి అసోసియేట్‌ ప్రొఫెసర్‌ నిజామి, సామాజిక కార్యకర్త కె. సజయ, ఐజేయూ స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు ఎం.ఏ. మజీద్‌, జాతీయ ఉపాధ్యక్షుడు వై. నరేందర్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ, ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాములు తదితరులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ. రాజేష్‌, బి. కిరణ్‌కుమార్‌, హెచ్‌యూజే అధ్యక్షుడు శిగా శంకర్‌గౌడ్‌, చిన్న, మధ్యతరహా పత్రికల సంఘం అధ్యక్షుడు యూసుబాబు, ప్రధాన కార్యదర్శి అశోక్‌, యూనియన్‌ మహిళా విభాగం నాయకులు కళ్యాణం రాజేశ్వరి, అత్తలూరి అరుణ తదితరులు హాజరయ్యారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular