స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అంతిమ లబ్ధిదారుడు చంద్రబాబు నాయుడే
ఏపీ సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్
మంగళగిరి సెప్టెంబర్ 9: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అంతిమ లబ్ధిదారుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడేనని ఏపీ సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్ అన్నారు. ఈ కేసులో టీడీపీ అధినేతను ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు చెప్పారు. శనివారం ఉదయం 6 గంటలకు చంద్రబాబును అరెస్టు చేసినట్లు వెల్లడించారు. చంద్రబాబు అరెస్టుపై మంగళగిరిలో సీఐడీ చీఫ్ మీడియా సమావేశం నిర్వహించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల ఏర్పాటులో కుంభకోణం జరిగిందన్నారు. ఇందులో రూ.550 కోట్ల మేర అక్రమాలు జరిగాయని గుర్తించామన్నారు. ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన రూ.371 కోట్లు, డిజైన్ టెక్ సహా ఇతర షెల్ కంపెనీలకు వెళ్లినట్లు తేలిందని చెప్పారు. సీమెన్స్ తరఫున డిజైన్ టెక్ అనే సంస్థ ద్వారా లావాదేవీలు జరిగాయని, ఒప్పందం జరిగే సమయానికి ఆ సంస్థ లేదని తెలిపారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు గంటా సుబ్బారావును నియమించారని, ఆయనకు నాలుగు పదవులు కట్టబెట్టారని చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో షెల్ కంపెనీల ద్వారా అక్రమాలకు పాల్పడిన వ్యవహారంలో మాజీ సీఎం చంద్రబాబు ప్రధాన కుట్రదారు అని, అంతిమ లబ్ధిదారు కూడా ఆయనేనని తెలిపారు. వికాస్ కన్వెల్కర్ సహా ఇతర నిందుతులు ఈ అక్రమాల్లో నిందితులుగా ఉన్నారని వెల్లడించారు. ఈ కేసుల్లో చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఆర్థిక కుంభకోణంలో అప్పటి కార్యదర్శితోపాటు చంద్రబాబు తనయుడు లోకేష్ పాత్రపై దర్యాప్తు జరుగుతున్నదని చెప్పారు. ఈ కేసులు ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబు సాక్ష్యాలను మాయం చేసే అవకాశం ఉందని, అందుకే ఆయన అరెస్టు అనివార్యం అయిందని స్పష్టం చేశారు.సిమెన్స్ సంస్థ నుంచి రూ.550 కోట్లు పెట్టుబడి వస్తుందని పేర్కొంటూ ప్రభుత్వం జీవోల ద్వారా రూ.371 కోట్లు ఇచ్చేసిందని పేర్కొన్నారు. దీనికి కేబినెట్ ఆమోదం కూడా లేదన్నారు. రూ.540 కోట్ల వ్యయం అయ్యే ఆరు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. రూ.3 వేల కోట్లతో అన్ని కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రూ.58 కోట్లతో సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారన్నారు. దాన్నే బాగా పెంచి చూపించి కుట్రకు పాల్పడ్డారని పేర్కొన్నారు. డిజైన్ టెక్‌కు చెందిన మనోజ్ పర్డాసాని, చంద్రబాబు కార్యదర్శి శ్రీనివాస్ కూడా పరారీలో ఉన్నారని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి సీఐడీ బృందాలు దుబాయ్, అమెకాకు వెళ్తున్నాయని సీఐడీ చీఫ్ వెల్లడించారు. ఈ కేసులో రాజేశ్, నారా లోకేశ్ పాత్రలు ఎంత ఉన్నాయన్నది త్వరలోనే తేలుస్తామన్నారు. ఏపీ ఫైబర్ నెట్‌తోపాటు ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమాల కేసులో లోక్‌శ్ పాత్రపైనా విచారణ చేస్తామని తెలిపారు.నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరు పరుస్తామన్నారు. ఆయన వయస్సు దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. అరెస్టు అనంతరం విజయవాడ తరలించేందుకు హెలికాప్టర్‌లో తీసుకెళ్లడానికి బాబు తిరస్కరించారని, రోడ్డు మార్గంలోనే వస్తానని చెప్పారని సీఐడీ చీఫ్ వెల్లడించారు.