చివరి దశకు మావోయిస్టుల పోరాటం
వరంగల్, మార్చి 14, (వాయిస్ టుడే)
The Maoist Struggle Reaches Its Final Phase
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక కీలకమైన అధ్యాయం అవిష్కృతంకానుంది. దశాబ్దాల కాలంగా సాయుధ పోరాట బాటలో సాగిన మావోయిస్టులు భారీ సంఖ్యలో జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధమయ్యారు. . దశాబ్దాల కాలంపాటు అజ్ఞాతంలో ఉండి, సాయుధ పోరాటమే మార్గమని నమ్మిన మావోయిస్టు అగ్రనేతలు రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తున్నారు. జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత సీనియర్ నాయకులంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. దాదాపు గంటసేపు సాగిన సమావేశంలో మావోయిస్టు నేతలు తమ అంతరంగాన్ని ఆవిష్కరించారు. వారి సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలోనే రాజకీయ పార్టీ విషయం కూడా చర్చకు వచ్చింది. నాలుగున్నర దశాబ్దాల పాటు అడవిని నమ్ముకొని పోరాటం చేసిన కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవలే డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు, సెంట్రల్ మిలటరీ కమిషన్ ఇన్‌ఛార్జీ తిప్పిరి తిరుపతి(దేవ్‌జి), కేంద్ర కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి(సంగ్రామ్), రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు(జగన్), రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నర్సింహారెడ్డి (గంగన్న) ముఖ్యమంత్రిని కలిశారు. వీరితోపాటు గతంలోనే లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యులు పుల్లూరి ప్రసాద్, పోతుల పద్మావతి కూడా ఉన్నారు. ఈ భేటీలో మావోయిస్టు నేతలు ఒక సంచలన ప్రతిపాదన చేశారు. కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే సాయుధ పోరాటాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగిస్తామని పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని రద్దు చేస్తామని దేవ్‌జి, రాజిరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అనుసరించిన పోరాట పంథాను వదిలి, చట్టపరంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. అంతేకాకుండా, ప్రభుత్వాలు సహరిస్తే రాజకీయ పార్టీగా మార్చేందుకు కూడా సిద్ధమని వారు తెలిపారు. ఈ ప్రతిపాదనపై స్పందించిన రేవంత్ రెడ్డి, ఈ అంశం తన పరిధిలో లేదని త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసినప్పుడు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తాను అని హామీ ఇచ్చారు. కేంద్రం ఓకే అంటే కేంద్ర హోంమంత్రిని ఇక్కడికి పిలిపించి, ఒక భారీ సభ ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ప్రకటిస్తామని సీఎం చెప్పారు. మావోయిస్టు నేతలు తమ పునరావాసం, ఇతర మౌలిక వసతుల గురించి ముఖ్యమంత్రి కీలక అభ్యర్థనలు చేశారు. లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణమే ఆరోగ్య శ్రీ సదుపాయం కల్పించాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం లొంగిపోయిన వారికి 30 ఏళ్ల క్రితం నాటి రివార్డు సొమ్మునే ఇస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా ఉందని తెలిపారు. దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించారు. ఇళ్ల స్థలాలు ఇవ్వడంపై క్యాబినెట్‌లో చర్చిస్తామని, అయితే వ్యవసాయ భూమి ఇవ్వడం సాధ్యం కాదని సీఎం స్పష్టం చేశారు. ఏవైనా రాజకీయ అంశాలు ఉంటే ప్రభుత్వ సలహాదారు కేశవరావును, ఆర్థికపరమైన అంశాల కోసం వేం నరేందర్‌రెడ్డిని కలవాలని సీఎం సూచించారు. జన జీవన స్రవంతిలో కలిసిన నేతలకు ఎలాంటి భద్రతా పరమైన ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. హింస దేనికీ పరిష్కారం కాదని, ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని ఆయన హితవు పలికారు. సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్‌కు చెందిన సుజాతక్కతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన మల్లోజుల కోటేశ్వరరావు భార్య అయిన ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. లొంగిపోయిన మావోయిస్టుల వివరాలు, వారికి ప్రభుత్వం తరఫున అందే పునరావాస ప్యాకేజీలు, ఈ పరిణామం వెనుక ఉన్న కీలక అంశాలను సీఎం వివరించే అవకాశం ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, లొంగిపోయే మావోయిస్టులకు ప్రభుత్వం తక్షణ సహాయంతో పాటు, వారు సమాజంలో గౌరవప్రదంగా బతకడానికి అవసరమయ్యే ఉపాధి, ఇతర వసతులను కల్పిస్తుంది. ముఖ్యమంత్రి స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా, హింసను వీడి వచ్చే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని బలమైన సందేశాన్ని పంపాలని భావిస్తున్నారు.



