Sunday, September 8, 2024

ముగిసిన సీఎంల భేటీ..

- Advertisement -

ముగిసిన సీఎంల భేటీ..(చూసి వాడుకోవాలి)
గంటన్నర పాటు చర్చలు
హైదరాబాద్, జూలై 6,
ఏపీ సీఎం చంద్రబాబు – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ శనివారం సాయంత్రం  ప్రజాభవన్ లో భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వం మారి  పాతిక రోజులైంది. చంద్రబాబు- రేవంత్ కు ఉన్న సంబంధాల దృష్ట్యా అయితే ఇన్ని రోజులు సమయం అన్నది ఎక్కువే అనుకోవాలి. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి.. ఇప్పటి ఆంధ్ర సీఎం చంద్రబాబు పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే. ఆ పార్టీకి తెలంగాణలో ముఖ్యమైన ఫేస్ గా నిలబడ్డ మనిషి. మారిన రాజకీయ పరిణామాల్లో రేవంత్ కొన్నేళ్ల క్రితమే కాంగ్రెస్లోకి వెళ్లిపోయి అక్కడ ముఖ్యమంత్రి కూడా అయిపోయారు. చంద్రబాబు మొన్ననే తిరుగులేని విజయంతో ఆంధ్రాలో అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్ వెళ్తారన్న చర్చ కూడా నడిచింది. అయితే చంద్రబాబు అంటే ప్రస్తుతం తెలుగుదేశం నేత మాత్రమే కాదు. ఆయన ఎన్డీఏలో కీలక భాగస్వామి. అటు రేవంత్ ఇండీ కూటమిని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ నేత. కాబట్టి వాళ్లిద్దరూ ముఖ్యమంత్రుల హోదాలను దాటుకుని సంబంధాలను నెరపడం ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమే. కనీసం బహిరంగంగా ఆ పని చేయలేరు. ఇప్పటికే రాష్ట్రం విడిపోయి పదేళ్లు అయినా ఇంకా పరిష్కరించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇందుకోసం ఈ దఫా చంద్రబాబు ముందుగా చొరవ తీసుకున్నారు.  వారం రోజుల కిందట ఆయనే తెలంగాణ సీఎం రేవంత్కు ఓ లేఖ రాసి 6వతేదీన కలిసి మాట్లాడుకుందాం అని ప్రతిపాదించారు. రేవంత్ రెడ్డి దీనికి సమ్మతించడంతో శనివారం మీటింగ్ ఖరారు అయింది. మొత్తం 10 అంశాలపై ఈ సమావేశం జరుగుతున్నట్లు సమాచారం. భేటీకి తెలంగాణ నుంచి సీఎం తోపాటు ఉప మఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రి శ్రీధర్ బాబు,  ఏపీ నుంచి ముగ్గురు మంత్రులు మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్రెడ్డి, కందుల దుర్గేష్ ఈ  భేటీలో పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల సీఎస్లు, ముఖ్య కార్యదర్శులు కూడా హాజరయ్యారు.  దాదాపు 60ఏళ్లు కలిసున్న రాష్టం 2014లో విడిపోయింది. తెలంగాణ ఏర్పాటై కూడా పదేళ్లు దాటినా రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. అంతకు ముందున్న రెండు ప్రభుత్వాల్లో ఈ సమస్యల పరిష్కారానికి కొంత వరకూ ప్రయత్నాలు జరిగినా అవి ముందుకు పోలేదు.  గడచిన పదేళ్లపాటు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2014లో రాష్ట్రం విడిపోయాక విభజన సమస్యలు పరిష్కరించుకోవడానికి అప్పటి సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ ప్రయత్నాలు చేసినా అవి ముందుకు సాగలేదు. కేసీఆర్ అమరావతి ప్రారంభోత్సవానికి హాజరై సంఘీభావం తెలిపారు. ఆ తర్వాత అంతా బాగుంటుదనుకున్నా.. రాజకీయ కారణాలతో ఇద్దరి మధ్యా బాగా దూరం పెరిగింది. ఓటుకు నోటు కేసు ఈ దూరాన్ని శాశ్వతం చేసింది . ఉమ్మడి హక్కుగా సెక్రటేరియట్లో వచ్చిన భవనాలను అప్పగించడానికి అప్పట్లో ఏపీ ఒప్పుకోలేదు. విభజన చట్టం 9,10 షెడ్యూల్లో ఉన్న ఉమ్మడి సంస్థల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మెలిక పెట్టింది. ఆ తర్వాత అది విద్యుత్ సంస్థలు, నీటి వాటాల జగడాల వరకూ వెళ్లిపోయింది. ఏపీలో ప్రభుత్వం మారింది. అంతకు ఆరు నెలల ముందే తెలంగాణలో రెండోసారి సీఎం అయిన కేసీఆర్ ఏపీలో చంద్రబాబును దించడం కోసం.. జగన్ కు సహకరించడం బహిరంగ రహస్యమే. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్కు వచ్చిన జగన్.. అన్ని సమస్యలూ పరిష్కరించుకుంటామన్నారు. బేసిన్లు బేషజాలూ వదిలేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. రాయలసీమ గొంతెండుతోంది.. గోదావరి నీళ్లు తీసుకెళ్లి దానిని తడుపుదాం అంటూ.. సంయుక్తంగా అప్పటి సీఎంలు ఓ కొత్త ప్రాజెక్టును కూడా ప్రతిపాదించారు. తెలంగాణలోని సెక్రటేరియేట్ బిల్డింగులను జగన్ తెలంగాణకు అప్పగించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఏదీ ముందుకెళ్లలేదు.  చంద్రబాబు ప్రభుత్వం అంత సీరియస్ గొడవలు లేకపోయినా ఆ తర్వాత జగన్ – కేసీఆర్ కూడా అంటీ ముట్టనట్లే ఉన్నారు. జగన్ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంది. కృష్ణా ట్రైబ్యునల్ విషయంలోనూ పేచీలు వచ్చాయి. అయితే ఇదంతా పైకి చేసే నాటకం అని లోలోన వాళ్లిద్దరూ ఒకటే అని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. సెంటిమెంట్ను రగిల్చి రెండు చోట్లా గెలిచేందుకు ఇద్దరు నేతలు వేసిన ఎత్తులని ఆరోపణలు వచ్చాయి. కారణం ఏదైనా.. ఆరునెలల క్రితం తెలంగాణలో నెలరోజుల కిందట ఆంధ్రాలో ప్రభుత్వాలు మారిపోయాయి. మళ్లీ ఇప్పుడు విభజన సమస్యలు తెరపైకి వచ్చాయి.
తమ సమస్యల విషయంలో రెండు రాష్ట్రాలూ తమ వాదనలకే కట్టుబడి ఉండటంతో దూరం బాగా పెరిగింది. రాష్ట్ర విభజన నాటి ప్రాంతీయ ద్వేషాలు లేనప్పటికీ.. ప్రభుత్వాల పరంగా పట్టు విడిచే పరిస్థితి లేదు. అయితే చంద్రబాబు – రేవంత్ రెడ్డి ముధ్య ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ఎప్పటినుంచో ఉన్న సమస్యలకు ఓ ముందడుగు పడుతుందా అన్న ఆశ కనిపిస్తోంది. విభజన చట్టంలోని 9,10 వషెడ్యూల్ లోని సంస్థల వాటాల పంపకం ఇంకా తేలలేదు. ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం 89 ప్రభుత్వ కంపెనీలు, 9 కార్పోరేషన్లు 9 వషెడ్యూల్లో ఉన్నాయి. ఏపీ పోలీస్ అకాడమీ, ఫారెస్ట్ అకాడమి, స్టేట్ కో  ఆపరేటివ్ యూనియన్ లాంటి 107 సంస్థలు 10 వషెడ్యూల్లో ఉన్నాయి. వీటికి సంబంధించిన ఆస్తులు రెండు చోట్లా ఉన్నాయి.  ఎక్కువ ఆస్తులు హైదరాబాద్ నగరంలోనే ఉండటంతో ఉమ్మడి భాగస్వామ్యం ప్రకారం వీటి వాటా తేల్చాలని ఏపీ డిమాండ్ చేసింది. వీటి పంపకం కోసం అప్పట్లో షీలాబేడి నేతృత్వంలో కమిటీ వేసినప్పటికీ.. రెండు ప్రభుత్వాలు తమ వాదనకు కట్టుబడి ఉండటంతో పంపకాలు కుదర్లేదు. మొదటి ఐదేళ్లు ఉద్యోగ సంఘాలు ఎక్కువ ప్రభావం చూపాయి. వాళ్లని కాదని ప్రభుత్వాలు కూడా ముందుకు వెళ్లలేకపోయాయి. తెలంగాణ కు చెందిన 104 మంది ఉద్యోగులు ఆంధ్రాలో పనిచేస్తున్నారు. దీనిపై పదేళ్లుగా గొడవ జరుగుతూనే ఉంది. విభజన సమయంలో అప్పటికి తెలంగాణలో ఉన్న 7మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపారు. విభజించిన ఏపీకి పోలవరం జాతీయ హోదా ప్రాజెక్టు ఇచ్చారు. ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ముంపు ప్రాంతంలోని ఈ మండలాలు కచ్చితంగా ఏపీలో ఉండాలి. దీనిపై తెలంగాణలో నిరసన వ్యక్తమైంది. ఆ మండలాలను తిరిగి తెలంగాణకు ఇచ్చేయాలన్న డిమాండ్ మొదలైంది. అయితే అవి ఒకప్పుడు ఆంధ్రాలో ఉన్న ప్రాంతాలే అని ఏపీ వాదిస్తోంది. ఇప్పుడు అన్ని మండలాలను కాకపోయినా కొన్ని ఊర్లను అయినా తెలంగాణలోకి తీసుకురావాలన్న వాదన ఉంది. అక్కడ ప్రజలు కూడా తెలంగాణలో ఉండేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇవాల్టి చర్చల్లో రెవిన్యూ మంత్రులు కూడా పాల్గొంటుడటంతో వీటిపై చర్చ ఉంటుందన్న అంచనా ఉంది. ఇక నీటి ప్రాజెక్టుల విషయంపై ఏం చేస్తారన్న సందేహం ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను తెలంగాణ వ్యతిరేకిస్తుంటే.. తెలంగాణలో ప్రతిపాదించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ను ఆంధ్రప్రదేశ్ వ్యతిరేస్తోంది. అయితే ఇప్పుడే వీటి జోలికి వెళ్లకూడదన్న ఆలోచన ఉన్నట్లుగా ఉంది. అందుకే ఈ సారి సమావేశంలో ఏపీ నుంచి ఇరిగేషన్ మంత్రి పాల్గొనడం లేదు. అందువల్ల దీనిపై చర్చలు ఉండవ్ అనుకుంటున్నారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఏపీ భవన్ సమస్యను ఆ మధ్య పరిష్కరించుకున్నారు. ఢిల్లీలోని 19.7 ఎకరాల భూమిని రెండు రాష్ట్రాలూ సామరస్యంగా పరిష్కరించుకున్నాయి. అదే చొరవతో మిగిలిన సమస్యల పరిష్కారం కోసం చూస్తున్నారు. అయితే విద్యుత్ సంస్థల ఆస్తుల  పంపిణీకి సంబంధించి గొడవలు అలాగే ఉన్నాయి. వాటా ప్రకారం తమకు 6వేల కోట్ల రూపాయలు రావాలని 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వాదించింది. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం దీనిపై ఒత్తిడి చేయలేదు. దానికి కౌంటర్గా తమకు విద్యుత్ సంస్థల పంపిణీలో అన్యాయం జరిగింది. తమకే 21వేల కోట్లు వస్తాయని కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ నుంచి ఈ మొత్తాన్ని ఇప్పించాలని ప్రతీసారి ఏపీ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూనే ఉంది. కేంద్రం మాత్రం  ఈ వివాదాన్ని పరిష్కరించడానికి చొరవ చూపలేదు. ఈ విషయంలో రెండు ప్రభుత్వాలు ఏం చేస్తాయన్నది ఇప్పుడు చూడాలి. ఎందుకంటే.. ఏపీ వెనుకడుగు వేస్తే.. అక్కడ ఇబ్బందులొస్తాయి. కేసీఆర్ చెప్పిన లెక్క కాదని ఏపీ చెప్పింది ఒప్పుకుంటే రేవంత్ కు సమస్యలొస్తాయి.విభజన సమస్యలు అంత తేలిగ్గా పరిష్కారం అయ్యేవే అయితే పదేళ్ల నుంచి కొంచం కూడా పురోగతి లేకుండా ఉండవ్. ఈ విషయాలన్నీ భావోద్వేగాలతో ముడిపడి ఉన్నాయి. ఇద్దరు ముఖ్యమంత్రులను కలిపి కూర్చోబెట్టి పరిష్కారం చేయడానికి అప్పుడు రెండు రాష్ట్రాలకూ గవర్నర్గా ఉన్న నరసింహన్ ప్రయత్నించారు. ఆయన విభజన విషయంలోనూ కీలకంగా ఉన్న వ్యక్తి. ఆయన చొరవ చూపితేనే పరిష్కారం కాని సమస్యలు ఇప్పుడు ఎలా తీరతాయన్నది సందేహమే. అయితే ఇక్కడ ఉన్న ఒకే ఒక్క ఆశ ఏంటంటే.. పరస్పరం తీవ్రంగా వ్యతిరేకుంచుకునే వ్యక్తులు ఇప్పుడు సీఎంలు గా లేరు. రేవంత్ రెడ్డి తన వంతుగా తాను పరిష్కారానికి కృషి చేశాను అనే పేరు సంపాదించాలనే తపనతో ఉన్నారు. చంద్రబాబు 2014తో పోల్చితే మరింత శక్తివంతంగా ఉన్నారు. కేంద్రంలో బలంగా ఉన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే కేంద్రంతో చెప్పి ఒప్పించగలిగే పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే ఇప్పుడు అప్పటితో పోల్చితే అంత భావోద్వేగమైన సమస్యలు కూడా లేవు. కాబట్టి ఎప్పటి నుంచో ఉన్న కొన్ని మొండి సమస్యలను తాడో పేడో తేల్చడానికి వీళ్లు ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదు.  కానీ వీళ్లిద్దరి మధ్యా ఉన్న పూర్వ సంబంధాల దృష్ట్యా బీఆర్ఎస్ దీనిని రాజకీయంగా ఎలా వాడుకుంటుంది, తెలంగాణ బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుంది.. తెలంగాణ సమాజం ఎలా చూస్తుంది అన్న విషయాలు కూడా గమనించాలి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్