దేశానికే ఆదర్శంగా కొత్త రెవెన్యూ చట్టం
The new revenue law is a model for the country
నాగార్జునసాగర్
ప్రస్తుతం ఉన్న రెవిన్యూ చట్టంలో మార్పులను తీసుకువచ్చి దేశానికే రోల్ మోడల్ గా ఉండేలా నూతన రెవెన్యూ (ఆర్ ఓ ఆర్ ) చట్టాన్ని తీసుకురానున్నామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ప్రస్తుతం ఉన్న రెవెన్యూ చట్టంలో తప్పొప్పులను సవరించి ,అన్ని రకాల భూ సమస్యలను పరిష్కరించి నూతన చట్టాన్ని తీసుకువచ్చేందుకు ఉద్దేశించి పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన నాగార్జునసాగర్ నియోజకవర్గం, తిరుమలగిరి సాగర్ మండలం, నెల్లికల్ గ్రామంలో నిర్వహించిన రైతుల ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి శనివారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో తెచ్చిన 2020 రెవెన్యూ చట్టం,ధరణి వల్ల రాష్ట్రంలోని రైతులు, ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని,, 2020 చట్టాన్ని అలాగే ధరణిలోని తప్పొప్పులను సవరించేందుకు దేశంలోని అన్ని రెవెన్యూ చట్టాలను పరిశీలించి మేలైన చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను సేకరించి పబ్లిక్ డొమైన్ లో ఉంచినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే తిరుమలగిరి సాగర్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడం జరిగిందని ,నూతన రెవెన్యూ చట్టంపై ప్రజల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే చట్టం తీసుకురావాలని ,అలాగే ప్రధాన ప్రతిపక్ష పార్టీల సూచనలు సైతం పరిగణలోకి తీసుకొని అతి కొద్ది రోజుల్లోనే నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రజల ముందుకు తీసుకురాబోతున్నామని మంత్రి వెల్లడించారు. అర్హులైన పేదవారికి. ప్రభుత్వ భూములు అందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని ,ప్రత్యేకించి తిరుమలగిరి సాగర్ లో కొంతమంది పొజిషన్లో ఉన్నప్పటికి పట్టాలు లేవని, పట్టాలున్న వారికి భూమిలేదని, అలాగే ఎవాక్యూవేషన్ ప్రాపర్టీ కి సంబంధించి, ఇతర ప్రభుత్వ భూములకు సంబంధించిన చేస్తున్న సర్వే పూర్తయిన తర్వాత సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని తెలిపారు. తిరుమలగిరి సాగర్లో సుమారు 13 వేల ఎకరాల కు బోగస్ పట్టా పాస్ పుస్తకాలు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు తమ దృష్టికి తీసుకువచ్చారని, ప్రభుత్వం పేదలకు మంచి చేయాలన్నదే తపన అని, ప్రభుత్వాస్తులన్నీ పేదవాడికి చెందాలని, పేదవాడికి చెందేలా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని చెప్పారు. తిరుమలగిరి సాగర్ లోని 3500 నుండి 4 వేల ఎకరాలు అర్హులైన పేదవారికి పట్టాలు ఇవ్వాల్సి ఉందని, డిసెంబర్ 9న రాష్ట్ర ముఖ్యమంత్రిని నాగార్జునసాగర్ నియోజకవర్గానికి తీసుకువచ్చి ఇక్కడే బహిరంగ సభ ఏర్పాటు చేసి నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచుతామని మంత్రి వెల్లడించారు.