ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం
The philosophy of staying humble no matter how much you grow

పిఠాపురం, మార్చి 14,వాయిస్ టుడే
పవన్ కళ్యాణ్ .. ఆ పేరులోనే ఓ పవర్ ఉంది. పేజీలకు పేజీల డైలాగ్స్ చెప్పకపోయినా, స్ప్రింగ్‌లా డ్యాన్సులు చేయకపోయినా.. ఆయన తెరపై కనిపిస్తే చాలు అభిమానులు ఊగిపోతారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం, సాదాసీదా జీవితం, సాటి మనిషికి సాయం చేసే గుణం … ఇవే పవన్ కళ్యాణ్‌ను మిగిలిన హీరోల కంటే ప్రత్యేకంగా నిలబెట్టాయి. సామాన్యులే కాదు ప్రముఖులు ఆయన అభిమానులే. చిరంజీవి తమ్ముడి స్థాయి నుంచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం స్టాయికి చేరుకునే వరకు ఆయన ప్రస్థానాన్ని పరిశీలిస్తే. కొణిదెల వెంకట్రావు, అంజనా దేవి దంపతులకు 1968 సెప్టెంబర్ 2న మూడో కుమారుడిగా జన్మించారు పవన్ . వెంకట్రావు సాధారణ పోలీస్ కానిస్టేబుల్ .. వృత్తి రీత్యా ఆయన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు బదిలీ అవుతూ ఉండేవారు. తండ్రి ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో నివసించడం వల్ల పవన్ కళ్యాణ్ అన్ని యాసలు , మాండలీకాలు, సంస్కృతులు, ప్రజల జీవన విధానం గమనిస్తుండేవారు. తండ్రి చాలీచాలని జీతం, పేదరికం కారణంగా ఎన్నో కష్టాలు పడ్డ పవన్ కళ్యాణ్ తను హీరోగా నిలదొక్కుకున్న తర్వాత పేదల అభ్యున్నతి కోసం తన వంతు కృషి చేశారు.
అన్ని రంగాల మీద పట్టు
చిన్నతనంలో ఆస్తమా కారణంగా పవన్ ఎంతో బాధపడ్డారు. తరచూ అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితమయ్యేవారు, స్నేహితులూ తక్కువే. చదువులో చురుగ్గా లేకపోవడంతో ఎంతో ఒత్తిడి అనుభవించిన ఆయన ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. అన్నయ్య చిరంజీవి మార్గదర్శకత్వంలో సత్యానంద్ వద్ద నటనలో శిక్షణ తీసుకుని అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ద్వారా హీరోగా పరిచయమయ్యారు. నాటి నుంచి నేటి వరకు తెలుగు వారిని తన నటనతో అలరిస్తూనే ఉన్నారు. ఉన్నత చదువులు చదవకపోయినా అన్ని రంగాల మీద పట్టు సాధించాలనుకున్న పవన్ .. పారా గ్లైడింగ్ , కర్ణాటక సంగీతం, వయోలిన్ నేర్చుకున్నారు. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ చేసి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ గురించి కూడా కొంత పట్టు సాధించారు.
కీలక పాత్ర..
సినిమాలు, షూటింగ్‌లే కాదు.. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, పరిస్ధితులపై పవన్‌కు విస్తృతంగా అవగాహన ఉంది. అందుకే అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధినేతగా కీలకపాత్ర పోషించారు. తన నమ్మిన సిద్ధాంతాలు, భావజలానికి అనుగుణంగా జనసేన పార్టీని స్థాపించి పోరాటం మొదలుపెట్టారు. జనసేనను రాజకీయాలకు ప్రయోగశాలగా మార్చి అణగారిన వర్గాల నుంచి ప్రతిభావంతులను, సమర్ధులను నాయకులుగా తీర్చిదిద్దారు పవన్ . 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించారు. పదేళ్ల పోరాటం తర్వాత పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది సగర్వంగా అసెంబ్లీలో అడుగుపెట్టి, డిప్యూటీ సీఎంగానూ బాధ్యతలు చేపట్టారు.
ట్రెండ్ సెట్టర్ గా పవన్
మరి ఇన్నేళ్ల ప్రస్థానంలో నటుడిగా, రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎన్నికోట్ల ఆస్తులు సంపాదించారోనని అందరికీ ఓ డౌట్. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా పవన్ కళ్యాణ్ ఆస్తులు రూ.165 కోట్లు. జన్వాడ, మంగళగిరి, హైదరాబాద్‌లలో రూ.118 కోట్ల స్థిరాస్థులు.. రూ.14 కోట్లు విలువైన కార్లు, బైకులు ఉన్నాయి. ఇంకా హార్లే డేవిడ్‌సన్ బైక్, బెంజ్ మేబ్యాచ్, రూ.5.4 కోట్ల విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారు, రూ.2.3 కోట్ల విలువైన టయోటా క్రూయిజెర్ పవన్ వద్ద ఉన్నాయి. గడిచిన ఐదేళ్లలో ఆయన రూ.114.76 కోట్లను ఆర్జించగా.. ఆదాయపన్నుగా రూ.47.07 కోట్లు, జీఎస్టీ కింద రూ.26.84 కోట్లను చెల్లించారు. పవన్‌కు రూ. 64.26 కోట్లు అప్పులుండగా.. గడిచిన ఐదేళ్లలో రూ.20 కోట్లను విరాళాల రూపంలో అందజేశారు. రాజకీయాల్లోకి వచ్చి డబ్బును వెనకేసుకున్న లీడర్లకు పవన్ పూర్తి విరుద్ధం. తన సంపద పది మందికీ ఉపయోగపడితే అంతకంటే తృప్తి లేదంటారు . గబ్బర్ సింగ్‌లో చెప్పినట్లుగా తను ట్రెండ్ ఫాలో అవ్వడు.. ట్రెండ్ సెట్ చేస్తాడు.