రాజ్యాంగ రచనలో తెలుగువారి పాత్ర చిరస్మరణీయం
The role of Telugu people in the drafting of the Constitution is memorable
ప్రముఖుల చిత్రాలు
-చరిత్రతో వినూత్నంగా అసెంబ్లీ కేలండర్
ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమరావతి, డిసెంబర్ 28 :
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఆనాటి రాజ్యాంగ రచనలో భాగస్వామ్యులైన తెలుగు ప్రముఖులను స్మరించుకునేలా 2025వ సంవత్సరానికి రూపొందించిన నూతన కేలండర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉండవల్లిలోని నివాసంలో ఆవిష్కరించారు. కేలండర్లో ప్రచురించిన ఒక్కో ప్రముఖుడి గొప్పతనాన్ని ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో మరోసారి గుర్తుచేశారు. ‘గో బ్యాక్ సైమన్’ అంటూ తెల్లదొరలను ఎదిరించి స్వాంతంత్ర్య ఉద్యమంలో తెగువ చూపిన తెలుగు ధీరుడు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు భారత రాజ్యాంగ రచనలోనూ అంతే చొరవ కనబరిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శ్రీ టంగుటూరి రాజ్యాంగంలోని ప్రధానమైన స్థానిక సంస్థలు, గవర్నర్ విచక్షణ అధికారాలు వంటి అంశాలను రూపొందించడంలో సహాయసహకారాలు అందించారని కీర్తించారు. అలాగే శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య రాజ్యాంగ సభ సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా సేవలు అందించారని, ఢిల్లీలో పరిపాలన – శాసనసభ వ్యవస్థపై సిఫార్సులు చేసిన కేంద్రపాలిత ప్రాంతాల కమిటీకి నేతృత్వం వహించారని ముఖ్యమంత్రి చెప్పారు.