దేశవ్యాప్తంగా దంచికొడుతున్నా ఎండలు
భానుడి భగభగలకు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్న జనాలు
న్యూ డిల్లీ ఏప్రిల్ 9
The sun is scorching across the country.
దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి . పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే భారీగా నమోదవుతున్నాయి. భానుడి భగభగలకు జనాలు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. వృద్ధులు, పిల్లలు ఉక్కపోతకు అల్లాడిపోతున్నారు. దేశంలోని పలు రాష్ట్రాలను మంగళవారం వేడిగాలులు వణికించాయి. దేశరాజధాని ఢిల్లీ సహా గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ముఖ్యంగా ఎడారి రాష్ట్రం రాజస్థాన్ లోని బార్మర్ లో దేశంలోనే అత్యధికంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అక్కడ మంగళవారం 46.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైటనట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఇది సాధారణం కంటే 7.6 డిగ్రీలు ఎక్కువ అని పేర్కొంది. బార్మర్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. జైసల్మేర్‌లో 45 డిగ్రీల సెల్సియస్, చిత్తోర్‌గఢ్‌లో 44.5 డిగ్రీల సెల్సియస్, బికనీర్‌లో 44.4 డిగ్రీల సెల్సియస్, గంగానగర్‌లో 44.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 7 నుంచి 9 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ అని ఐఎండీ తెలిపింది.ఇక దేశరాజధాని ఢిల్లీలోని ప్రాథమిక వాతావరణ కేంద్రం సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. దీంతో రాజధానిలో ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సోమవారం సఫ్దర్‌జంగ్‌లో ఉష్ణోగ్రతలు 40.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు ఐఎండీ పేర్కొంది. ఇది సాధారణం కంటే 5.1 డిగ్రీలు ఎక్కువ. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని మొత్తం 27 స్టేషన్లలో 43 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. వాటిలో కనీసం 19 స్టేషన్లలో వేడిగాలులు నుండి తీవ్రమైన వేడిగాలులు నమోదైనట్లు పేర్కొంది.మరోవైపు గుజరాత్‌లోని సురేంద్ర నగర్‌లో 44.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజ్‌కోట్‌లో 44 డిగ్రీల సెల్సియస్, అమ్రేలిలో 43.8 డిగ్రీల సెల్సియస్, మహువ, కాండ్లాలో 43.4 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహువలో సాధారణం కంటే 8.3 డిగ్రీలు ఎక్కువ అని ఐంఎడీ పేర్కొంది. మహారాష్ట్రలోని అకోలాలో 44.1 డిగ్రీల సెల్సియస్, నందూర్‌బార్‌లో 43.5 డిగ్రీల సెల్సియస్, జల్గావ్‌లో 43.3 డిగ్రీల సెల్సియస్, అమరావతరిలో 43 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని గుణ, రత్లామ్‌లలో ఉష్ణోగ్రతలు వరుసగా 43.4, 43.2 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. ఏప్రిల్ 10, 11 తేదీల్లో గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వేడిగాలుల పరిస్థితుల నుంచి ఉపపశమనం లభించొచ్చని ఐఎండీ అంచనా వేసింది.