దేశ సమైక్యత, జాతీయ సమగ్రతే జనసేన లక్ష్యం: పవన్ కళ్యాణ్
The unity and integrity of the nation are the goals of Janasena: Pawan Kalyan.
న్యూఢిల్లీ, జూన్ 15: దేశ సమైక్యత, జాతీయ సమగ్రత పరిరక్షణే జనసేన పార్టీ ఆవిర్భావ లక్ష్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన “సేన ప్రస్థానం.. జాతీయ సమైక్యత కోసం” కార్యక్రమంలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, 2014లో జనసేన పార్టీని స్థాపించినప్పుడు అధికారం, పదవులు లక్ష్యంగా పెట్టుకోలేదని, దేశానికి సేవ చేయడం, దేశ సమగ్రతను కాపాడడమే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలు, భావజాలం రోజురోజుకు బలపడుతున్నాయని, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది జనసేన కోసం పనిచేయడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు.
జనసేన పార్టీ ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పార్టీ ఎన్నడూ వ్యతిరేకించలేదని, అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేపట్టిన తీరుపై మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేశామని చెప్పారు. విభజనలో జరిగిన లోపాల కారణంగా ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు, విభేదాలు కొనసాగుతున్నాయని అభిప్రాయపడ్డారు.
ఢిల్లీలోనే ఈ సమావేశాన్ని నిర్వహించడానికి కారణం దేశ రాజధానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యతేనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. త్యాగాలకు ప్రతీకగా, పాలనకు ప్రతిరూపంగా, రాజ్యాంగ విలువలకు ప్రతిబింబంగా నిలిచిన ఢిల్లీలో దేశ సమగ్రత కోసం కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా దేశభక్తికి జనసేన ఇచ్చే ప్రాధాన్యతను చాటుతున్నామని అన్నారు.
దేశానికి, జాతి సమగ్రతకు హాని కలిగించే శక్తులను జనసేన పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని హెచ్చరించారు. విభజనవాదాన్ని ప్రోత్సహించే వారిని పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, అలాంటి అంశాలపై జనసేన గళం ఎప్పుడూ బలంగానే వినిపిస్తుందని చెప్పారు.
ఢిల్లీని జనసేన పార్టీ అధికారం, పదవులు లేదా రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోదని, దేశభక్తి, దేశ సమైక్యత, జాతీయ సమగ్రత కోసం మాత్రమే దేశ రాజధాని బాట పడతామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఎంపీలు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని అన్ని ప్రాంతాల సమస్యలపై స్పందించాలని, జాతీయ దృక్పథంతో పనిచేయాలని ఆయన సూచించారు.
దేశ ప్రయోజనాలు, జాతీయ ఐక్యత, రాజ్యాంగ విలువల పరిరక్షణలో జనసేన పార్టీ తన పాత్రను మరింత బలోపేతం చేస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.




