గాయత్రిని మించిన శక్తి లేదు::బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరశర్మ
There is no power beyond Gayatri::Brahmshri Garrepalli Maheswarasharma
కోరుట్ల,
ఈ సృష్టిలో గాయత్రిని మించిన శక్తి మరొకటి లేనేలేదని బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రెపల్లి మహేశ్వరశర్మ అన్నారు. కోరుట్ల వాసవి కళ్యాణ భవనంలో సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో ‘అష్టాదశ పురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞం’లో భాగంగా సోమవారం బ్రహ్మవైవర్త మహా పురాణ సప్తాహ ప్రవచనం భక్తులను అలరించింది. ప్రాచీన సంస్కృత ప్రాక్భాషలో గాయత్రి అనే ఒక చంధస్సు ఉండేదని, దాని ఆధారంగానే గాయత్రి మంత్రం ఉద్భవించిందన్నారు. ఈ గాయత్రి మంత్ర తపోశక్తిని పంచ మాతృకల శక్తితో కలిపి 6వ శక్తిగా గాయత్రి మాత సృష్టి ఏర్పడడం జరిగిందన్నారు. ఏ యజ్ఞ యాగాలు చేసినా, ఏ నోములు పూజలు నోచినా గాయత్రి మంత్రంతోనే అవి పరిపూర్ణమని స్వామి పేర్కొన్నారు. ఏ జపంలోనైనా గాయత్రి మంత్రమే అత్యంత శక్తివంతమైనదని, ఎన్నిసార్లు ఆ మంత్రం జపిస్తే అంత శక్తి ఉత్పన్నమవుతుందని వివరించారు. కాబట్టి ఆధ్యాత్మికత, భక్తి భావన, పుణ్యం కావాలనుకునే వారికి ఆ గాయత్రి మంత్రమే
ఆచరణీయ మార్గమని మహేశ్వరశర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ ప్రచార సమితి అధ్యక్షులు మంచాల జగన్, ప్రధాన కార్యదర్శి బట్టు హరికృష్ణ, కమిటీ చైర్మన్ పడిగెల శ్రీనివాస్, కన్వీనర్ మోటూరి రాజేంద్రప్రసాద్, నిర్వాహకులు డాక్టర్ వేముల ప్రభాకర్, రాచమడుగు శ్రీనివాసరావు, వనపర్తి చంద్రం, భోగ శ్రీధర్, మంచాల రాజలింగం, దొంతుల సుందర వరదరాజన్, మహేష్, రామారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.