రాష్ట్రంలో సంక్షేమం లేదు
There is no welfare in the state :
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుధవారం నాడు అంబర్ పేట నియోజకవర్గంలో పర్యటించారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు కావడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అంబర్ పేట్ లో పర్యటించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కూడా చాలా సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్స్ వేసేందుకు జీహెచ్ఎంసీ డబ్బు లేదని చెప్పడం విడ్డూరమని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వలేదని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్న కాంగ్రెస్ కూడా ఇవ్వలేదని చెప్పారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన రేషన్ కార్డులు తప్ప.. ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు రాష్ట్రంలో ఎవ్వరికీ అందలేదని పేర్కొన్నారు. రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న ఐదు కేజీల ఉచిత బియ్యం అందడం లేదని పేర్కొన్నారు. అలాగే పొదుపు సంఘాల్లో చేరలేక పోతున్నారని, కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోలేక పోతున్నారని తెలిపారు. నెలలు గడుస్తున్నా ధ్వంసమైన రోడ్లను రిపేర్ చేయడం లేదని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఫామ్ హౌస్ వెళ్లాడని, కొత్త ప్రభుత్వం దానిపై ఉలుకు పలుకు లేదని దుయ్యబట్టారు. కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని, కాలేజీకి వెళ్లి మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తానన్న హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైటెక్ సిటీ లేదు.. హైదరాబాద్ లేదని, అభివృద్ధి వదిలేసి రియల్ ఎస్టేట్ దగ్గర వసూళ్లు చేస్తున్నాని ఆరోపించారు. రూ. 100 కోట్లు అక్రమంగా వసూలు చేస్తున్నారని, కనీస సమస్యలపై పట్టించుకునే నాయకుడు హైదరాబాద్ లో లేడని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.