కామారెడ్డిలో హస్తమా, కారా, అగ్ర నేతల మధ్య ఉత్కంఠ పోరు
ఒక్కతాటిపైకి రాని నేతలు
కెసిఆర్ గెలుపు అనుకున్నంత సులువేనా ?
కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబర్ (వాయిస్ టుడే): ఒకప్పుడు కీలక స్థానాల జాబితా ధరిదాపుల్లో కూడా కనిపించని కామారెడ్డి నియోజకవర్గానికి ఉన్నట్లుండి ఊహించనంతగా హైక్ వచ్చేసింది. ఎక్కడ, ఏ మూలన ఎన్నికలపై చర్చ జరిగినా కామారెడ్డి రాజకీయమే కీలకంగా మారింది. ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు ఉద్దండులు తలపడుతున్న స్థానంగా ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. గెలు పోటములు ఎలాగున్నా.. నువ్వా నేనా.. అనే స్థాయిలో రసవత్తరమైన పోటీ కనిపిస్తోంది. కారణమేమైనప్పటికీ అధికార భారాస, ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపి పార్టీల సవాళ్ళు, ప్రతి సవాళ్ళ మధ్య రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గత కొద్ది రోజుల నుండి బిజెపి పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాటిపల్లి వెంకటరమణారెడ్డి సైతం ఎవరికి తక్కువ కాదన్నట్లు కామారెడ్డి పట్టణంలో గ్రామాలలో కుల సంఘాలకు భవనాలు, భవనాలు ఉన్నచోట్ల ప్రహరీ గోడలకు, మరి కొన్ని చోట్ల గుడుల ఆవరణంలో బోరు వేయించడం, ఆర్థిక సాయం అందించడం తదితర సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. గతంలో ఎవరిని అడిగిన హస్తం పేరు చెప్పేవారు నేడు ఆ పరిస్థితి లేదు, ఎవరిని అడిగిన కారు గుర్తు చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీరిద్దరికీ తోడు బిజెపి అభ్యర్థి రంగంలోకి రావడంతో కమలం వికసిస్తున్నది. కామారెడ్డిలో ఎవరు గెలుస్తారనేది ఏ సర్వేలు సైతం చెప్పలేని పరిస్థితి నెలకొంది.
కామారెడ్డిలో కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళినప్పటి నుంచీ ఈ రెండు ప్రధాన పార్టీల కేడర్ ప్రచార వ్యూహాలతో సమాయత్తమవుతోంది. అభివృద్ధే ఆయుధమన్న పంథాతో ఇప్పటికే ప్రచారంలో దూసుకు పోతున్న భారాస కేడర్ తమదే పైచేయి అని ఎలుగెత్తి చాటు కుంటోంది. కానీ అంతకు దీటుగా బిజెపి ప్రచారం జోరందుకుంది. అదే సమయంలో తెలంగాణ ఇచ్చిన పార్టీ అన్న నినాదంతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో రాజకీయ నిపుణులు, విశ్లేషకుల దృష్టి అంతా కామారెడ్డి సెగ్మెంట్ పైనే కనిపిస్తోంది. ఏ గ్రామం ఎటు వైపు..? ఏ నాయకుడి పనితీరు ఎలా..? ఏ పార్టీకి ఎన్ని ఓ ట్లు..? అన్న అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి.
గతానికి భిన్నంగా కామారెడ్డి నియోజకవర్గం పేరు రాష్ట్ర రాజకీయాల్లో దేశ నాయకులు సైతం పాల్గొని నిత్యం కామారెడ్డి నియోజకవర్గం చర్చగా మారుతోంది. ప్రముఖులు కామారెడ్డి నుంచి బరిలో నిలవడంతో ఈ అసెంబ్లీ సెగ్మెంట్ ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ఇప్పటికే సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి బరిలో దిగారు. తాజాగా టీ-పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సైతం ఇక్కడి నుంచి కూడా పోటీ- చేసేందుకు సంసిద్ధమయ్యారనీ వినికిడి. ఇదే జరిగితే మూడు ప్రధాన పార్టీల సీనియర్ నాయకులు ఒకే అసెంబ్లీ నుంచి పోటీ- చేస్తుండడం, బలాబలాలను చాటుకునే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతుండడం లాంటి అంశాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం ప్రముఖుల మధ్య పోటీ-కి వేదికైంది. రాష్ట్రమంతా ఇటువైపే దృష్టి పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సమరంపై సామాన్య ప్రజలు మొదలుకుని అగ్రశ్రేణి నాయకుల వరకూ అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ తన స్థానం గజ్వేల్‌తో పాటు- కామారెడ్డి నుంచి బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించడంతో పాటు ప్రచారం కూడా మొదలుపెట్టారు. కెసిఆర్ నవంబర్ 9న కామారెడ్డిలో నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రచారం, వ్యూహాలు, మేనిఫెస్టో వంటి అంశాలతో నియోజకవర్గ నేతలు ప్రచారంలో ఉన్నారు. ఇక కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ప్రచారం మొదలు పెడితే రాజకీయం వేడెక్కనుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే కామారెడ్డి నియోజకవర్గంలో స్థానిక బిఆర్ఎస్ నాయకుల్లో సమన్వయం లోపించడం, వారికి ఐటి మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్లో సమావేశం ఏర్పాటు చేసి వారికి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. క్రమశిక్షణ రాహిత్యం దృశ్య కామారెడ్డి వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ భర్త గడ్డం చంద్రశేఖర్ ను పార్టీ నుండి ఈమధ్యనే సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన కూడా బిఆర్ఎస్ పార్టీకి ఓటు బ్యాంకు భారీ సంఖ్యలో నష్టపోయిందని చెప్పక తప్పదు. కాంగ్రెస్ మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ సారధ్యంలో రేవంత్ రెడ్డి సమక్షంలో కామారెడ్డి వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ గడ్డం చంద్రశేఖర్ గడ్డం సూర్యా భాయ్, కౌన్సిలర్లు పలువురు సీనియర్ టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ఊరూరు గ్రామ గ్రామాన ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ మూడు ప్రధాన పార్టీల నాయకుల పరిస్థితి ఇలా ఉంటే, కామారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కార్మికులతో అనుబంధం ఉన్న నాయకుడైన సిరిగాద సిద్ధిరములు సంవత్సరం నుండి బిఎల్ఎఫ్ పార్టీ నుండి అభ్యర్థిగా ప్రకటించబడి వారం నుండి ప్రచారం సైతం ప్రారంభించాడు. ఈ కార్మిక నాయకుని బలం, బలగం అంతా బీడీ కార్మికులతో పాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు. ఈ నాయకునికి కామారెడ్డి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సుమారు ప్రతి వ్యక్తితో అనుబంధం ఉంది, కారణం ఈ నాయకుడు కామారెడ్డి నియోజకవర్గంలోని ( దోమకొండ ) బిబిపెట్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి కావడం, ఇతని విద్యాభ్యాసం బిబిపేట, దోమకొండ మండలంలో కొనసాగింది. ప్రస్తుతం కామారెడ్డి నియోజకవర్గం లో ప్రధాన పార్టీ అభ్యర్థులతో దీటుగా బిఎల్ఎఫ్ ప్రచారం కొనసాగుతుంది. కామారెడ్డి నుండి ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది.