వారిని చిత్తుగా ఓడిస్తాం
తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పేదలకు 60 గజాలు, జర్నలిస్టులకు 250 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు
: మహేశ్వరం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి
ఎల్బీనగర్, వాయిస్ టుడే: మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు అభ్యర్థులు లేనట్లుగా ఒకరు చేవెళ్ళ నుండి, మరొకరు మేడ్చల్ నుండి వలస పక్షులను తీసుకువచ్చి పోటీ చేయించడం సిగ్గుచేటని కేఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే కొత్త మనోహర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. స్థానిక నేతలను కాదని బీఆర్ఎస్ పార్టీ నుండి సబితా ఇంద్రారెడ్డిని, కాంగ్రెస్ పార్టీ నుండి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అనే స్థానికేతరులకు టికెట్లు ఇచ్చారని, వారిని చిత్తుచిత్తుగా ఓడిస్తామని ఆయన శబదం చేశారు. పేద ప్రజల భూములను కొందరు కబ్జాలు చేశారని, కబ్జాదారుల నుండి ఆయా భూములను విడిపించి తిరిగి పేదలకే భూములు అందేలా తనవంతు కృషి చేస్తానని ఆయన హామీనిచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీ టికెట్ ను ఆశించి రేవంత్ రెడ్డికి కోట్లాది రూపాయలు ఇచ్చుకోలేక పార్టీ నుండి బయటకు వచ్చానని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం నుండి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటానని వివరించారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఇళ్లు, ఇళ్ల స్థలాలులేని నిరుపేదలకు 60 గజాల చొప్పున ఉచితంగా తన సొంత ఖర్చులతో ప్లాట్లను ఇస్తానని ఆయన హామీనిచ్చారు. మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రతి మండలానికో అధునాతన సౌకర్యాలతో కూడిన ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మిస్తానని తెలిపారు. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నా, ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నిర్మించి నాణ్యమైన విద్య బోధనలు అందిస్తానని అన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో పీజీ కళాశాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటానని భరోసా కల్పించారు. పేద ప్రజల అభివృద్దే ఏకైక ధ్యేయంగా తాను స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా మహేశ్వరం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా తాను గెలిచిన వెంటనే మహేశ్వరం నియోజకవర్గంలో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ 250 గజాల చొప్పున ప్లాట్లను కేటాయిస్తానని హామీనిచ్చారు. ప్రజలంతా తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని కొత్త మనోహర్ రెడ్డి ఓటర్లను కోరారు.



