గొల్ల ముత్యాలు భావి లో అక్రమ నిర్మాణాల జోరు
న్యాక్ ఇంజనీర్లు డ్యూటీ చేస్తున్నారా.? లంచాలతో సర్దుకుపోతున్నారా.?
సికింద్రాబాద్,అక్టోబర్ 27,(వాయిస్ టుడే ప్రతినిధి): నాచారం కాప్రా సర్కిల్ పరిధిలోని నాచారం డివిజన్ నందు అక్రమ నిర్మాణాలపై అక్రమార్కులు దృష్టి సారించారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ యంత్రాంగమంతా ఎన్నికల నిర్వహణపై దృష్టిసారించగా కొంతమంది. అత్యుత్సాహవంతులు ఇదే సమయమని అక్రమ నిర్మాణా లకు తెరలేపారు. అనుమతి లేకుండా కొన్ని నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలతో మరికొన్ని నిర్మాణాలు, ఇలా అక్రమ నిర్మాణాలు భారీగా జరుగుతున్నాయి. నాచారం డివిజన్ లోని గొల్లముత్యాలు బావి కాలనీలో జోరుగా అక్రమ నిర్మాణాల జోరు సాగుతోంది. అందరి దృష్టి ఎన్నికలపై ఉంటుందని అక్రమ నిర్మాణదారులు నిర్మాణ పనులు జోరుగా సాగిస్తున్నారు.
అదనపు అంతస్తులు వేయడమే కాకుండా స్టిల్ట్ స్థలంలో గదుల నిర్మాణాలు, కమర్షియల్
షట్టర్ల నిర్మాణాలు చేపడుతున్నారు. జిహెచ్ఎంసి కాప్రా సర్కిల్ నాచారం డివిజన్ పరిధిలో గత నెల రోజులుగా జోరుగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం లంచాలు తీసుకొని మౌనం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన గొల్ల ముత్యాలు బావి లేఅవుట్లో ఇప్పటికే పలు నిర్మాణాలు జిహెచ్ఎంసి అనుమతికి విరుద్దంగా జరుగగా, మరికొన్ని అక్రమ కట్టడాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. కాలనీలో చుట్టుపక్కల ఉండే కొందరు బ్రోకర్లుగా అవతారమెత్తారు. వారి సహాయంతో అక్రమ నిర్మాణదారులు యధేచ్చగా నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. నిర్మాణాల వద్దకు ఎవరు వచ్చినా మేం చూసుకుంటాం మా పేరు చెప్పండి అంటూ కొందరు దళారులు
అక్రమ నిర్మాణ దారుల వద్ద పెద్ద ఎత్తున ముడుపులు పుచ్చుకుని అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నారు.
నాచారం డివిజన్ పరిధిలోని విఎస్టి కాలనీ, భవానీనగర్ కార్తికేయనగర్ లో కూడా అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. జిహెచ్ఎంసి కాప్రా సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎప్పటిలా గా నోటీసులు ఇచ్చి చేతులు దులుపు కుంటారో లేక అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తారో వేచి చూడాల్సిందే.




