కుక్కల రక్తంతో వ్యాపారం…
హైదరాబాద్, ఏప్రిల్ 28, ( వాయిస్ టుడే)
Trading in Dog Blood…
హైదరాబాద్ షేక్‌పేటలోని ఒక ప్రైవేట్ వెటర్నరీ హాస్పిటల్‌లో దారుణమైన ‘బ్లడ్ బిజినెస్’ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వీధి కుక్కలను సంరక్షణ పేరుతో తీసుకొచ్చి.. వాటిని బోన్లలో బంధించి రక్తాన్ని
సేకరిస్తూ ప్యాకెట్ రూ. 25 వేల వరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జంతు సంక్షేమ బోర్డు, జీహెచ్‌ఎంసీ అధికారులు విచారణ
చేపట్టారు. సరైన రక్తనిధి కేంద్రాలు లేకపోవటాన్ని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు మూగజీవాలను హింసిస్తున్న ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఇప్పటి వరకు మనుషుల రక్తంతో,
అవయవాలతో వ్యాపారాలు చేశారు. కిడ్నీలను ఇడ్లీల మాదిరిగా అమ్మేసిన ఘటనలు అనేకం. తాజాగా.. హైదరాబాద్ నగరంలోని షేక్‌పేట ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ వెటర్నరీ హాస్పిటల్‌లో మూగజీవాలను
కూడా వదలకుండా వాటి రక్తాన్ని అమ్ముకుంటున్నారు. చికిత్స, సంరక్షణ పేరుతో వీధి కుక్కలను హాస్పిటల్‌కు తీసుకువచ్చి.. బంధించి అక్రమంగా రక్తాన్ని సేకరిస్తున్నారని జంతు ప్రేమికులు జీహెచ్‌ఎంసీకి
ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై జంతు హక్కుల ఉద్యమకర్త మేనకా గాంధీ సైతం రాష్ట్ర జంతు సంక్షేమ సంస్థకు ఫిర్యాదు చేయడంతో అధికారులు లోతైన విచారణ ప్రారంభించారు.ఆసుపత్రి సిబ్బంది ద్వారా
బయటకు వచ్చిన ఫోటోలు, వీడియోలు ఈ క్రూరత్వాన్ని కళ్లకు కడుతున్నాయి. నిర్వాహకులు ముందుగా వీధి కుక్కలను పట్టుకొచ్చి బోన్లలో ఉంచి పెంచుతారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే ఖరీదైన
పెంపుడు కుక్కల యజమానులే వీరి ప్రధాన లక్ష్యం. ఆ పెంపుడు శునకాలకు అవసరం ఉన్నా లేకపోయినా రక్తహీనత ఉందని తప్పుడు రిపోర్టులు సృష్టించి యజమానులను భయాందోళనకు గురిచేస్తారు.
ప్రాణాలు కాపాడాలంటే రక్తం ఎక్కించాలని నమ్మబలికి.. బోన్లలో బంధించిన కుక్కల రక్తాన్ని తీసి విక్రయిస్తారు. ఒక్కో బ్లడ్ ప్యాకెట్‌ను డిమాండ్‌ను బట్టి రూ. 18 వేల నుంచి రూ. 25 వేల వరకు
విక్రయిస్తున్నట్లు సమాచారం.ఈ అమానుష ప్రక్రియలో నిరంతరం రక్తాన్ని తీయడం వల్ల ఆరోగ్యంగా ఉన్న వీధి కుక్కలు తీవ్ర రక్తహీనతకు లోనై మృత్యువాత పడుతున్నాయి. కొన్నిసార్లు వీధి కుక్కల రక్తం
అందుబాటులో లేకపోతే.. చికిత్స కోసం వచ్చిన ఇతర పెంపుడు జంతువుల నుంచి కూడా బలవంతంగా రక్తాన్ని సేకరిస్తున్నట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం.. ఆరోగ్యంగా ఉన్న జంతువు యజమాని
సమ్మతితోనే రక్తమార్పిడి జరగాలి. కానీ ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా.. కనీస మానవత్వం లేకుండా వ్యాపారమే పరమావధిగా బ్లడ్ బిజినెస్ దందా కొనసాగుతోంది.నగరంలో జంతువుల కోసం
ప్రత్యేకంగా ప్రభుత్వ రక్తనిధి కేంద్రాలు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ఇలాంటి అక్రమ వ్యాపారాలు పుట్టుకొస్తున్నాయని జీహెచ్‌ఎంసీ పశువైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రి
రికార్డులను, నిల్వ ఉంచిన రక్తపు ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. కాగా, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు



