జైపూర్, అక్టోబరు25, (వాయిస్ టుడే): కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు టిక్కెట్లు దక్కకపోవడంతో తమలో తాము మదనపడుతున్నారు. తమకు టికెట్లు దక్కే అవకాశం లేక పోవడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను రెండు ఎస్సీ, ఒక ఎస్టీ రిజర్వుడు స్థానాలు ఉన్నాయి.రిజర్వుడు స్థానాలు మినహా మిగిలిన తొమ్మిది నియోజకవర్గాలకు నాలుగు అసెంబ్లీ టికెట్లు బీసీలకు ఇవ్వాల్సి ఉన్నా.. ఇప్పటి వరకు ఒక్క టికెట్ మాత్రమే ఇవ్వగా.. ఇక మరో టికెట్ ఇచ్చే అవకాశం ఏ మాత్రం లేకపోవడంతో ఉదయ్ పూర్ డిక్లరేషన్ ఉత్తదేనా అని ప్రశ్నిస్తున్నారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు లోక్ సభా స్థానాల పరిధిలో నాలుగు అసెంబ్లీ సీట్లు బీసీలకు దక్కాల్సి ఉంది. తెలంగాణ శాసన సభ ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి కాంగ్రెస్ నాయకత్వం ఉదయ్ పూర్ డిక్లరేషన్ అంటూ ఊదరగొట్టింది. టికెట్ల కేటాయింపులో కచ్చింతగా ఈ డిక్లరేషన్ ను అమలు చేసి తీరుతామని ప్రకటించారు.టీ పీసీసీ నాయకత్వం కూడా పదే పదే ఈ విషయం గురించి చర్చించింది. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను రెండు లోక్‌సభ నియోజక వర్గాలు నల్గొండ, భువనగిరి ఉన్నాయి. జనగామ, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలు భువనగిరి ఎంపీ స్థానం పరిధిలో ఉన్నాయి.ఉమ్మడి నల్గొండ అంశానికే పరిమితమై మాట్లాడుకున్నా.. తుంగతుర్తి (ఎస్సీ), నకిరేకల్ (ఎస్సీ), దేవరకొండ (ఎస్టీ) నియోజకవర్గాలను మినహాస్తే..మిగిలిన ఆలేరు, భువనగిరి, మునుగోడు, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, నల్గొండ నియోజకవర్గాలు జనరల్ స్థానాలుగా ఉన్నాయి .భువనగిరి ఎంపీ పరిధిలోని జనగామ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలు కూడా జనరల్ స్థానాలే. ఇవి మొత్తం కలిపితే 11 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఉదయ్ పూర్ డిక్లరేషన్ మేరకు ఒక లోక్ సభా స్థానం పరిధిలో రెండేసి నియోజకవర్గాల చొప్పున నాలుగు సీట్లు బీసీలకు కేటాయించాల్సి ఉన్నా ఆ పరిస్థితులు కనిపించడం లేదు.నాలుగు టికెట్లు దక్కాల్సిన చోట ఇప్పటి వరకు బీసీలకు ఇచ్చింది ఒక్కటే సీటు కావడం గమనార్హం. భువనగిరి ఎంపీ పరిధిలోని ఆలేరు స్థానాన్ని యాదవ సామాజిక వర్గానికి చెందిన బీర్ల ఐలయ్య యాదవ్ కు కేటాయించారు.జనగామ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలకు టికెట్లు దక్కే అవకాశం ఉంది. జనగామలో బీసీ సామాజిక వర్గానికి చెందిన టీపీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తనకు టికెట్ దక్కదన్న రూఢికి వచ్చాకే సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.ఇక, భువనగిరిలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మునుగోడు సీపీఐకి లేదా పార్టీ పోటీ చేస్తే చలమల్ల క్రిష్ణారెడ్డి, మిర్యాలగూడెం సీపీఎం కు లేదా.. బత్తుల లక్ష్మారెడ్డికి, సూర్యాపేలో ఆర్.దామోదర్ రెడ్డి, లేదా పటేల్ రమేష్ రెడ్డి లకు టికెట్లు దక్కే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఇక బీసీలకు ఇవ్వడానికి స్థానాలే లేవు.మునుగోడు నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన పున్న కైలాస్ నేత టికెట్ అడుగుతున్నారు. నల్లగొండ నుంచి తండు సైదులు గౌడ్ ఆశించినా ఇప్పటికే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. అంటే.. రిజర్వుడు స్థానాలు పోను, ఆలేరు మినహా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఏ నియోజకవర్గంలో కూడా బీసీ వర్గానికి టికెట్ కేటాయించే అవకాశం నూరు శాతం కనిపించడం లేదు.ఈ కారణంగానే ఉదయ్ పూర్ డిక్లరేషన్ అమలు కావడం లేదని, కాంగ్రెస్ బీసీలకు మొండి చేయి చూపించిందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ పరిస్థితులను గమనించి బీసీ వర్గానికి చెందిన నాయకుడు డాక్టర్ చెరుకు సుధాకర్ సైతం శనివారం బీఆర్ఎస్ లో చేరిపోయారు. ఆయన నల్గొండ టికెట్ కోసం దరఖాస్తు చేశారు. ఆయనే కాకుండా నల్గొండ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి సైతం దరఖాస్తు చేశారు. బీసీ వర్గాల నుంచి టికెట్లు కోరిన వారి సంఖ్య ఎక్కువే ఉన్నా.. వచ్చింది మాత్రం ఒక్కటే అని, సీట్లన్నీ రెడ్డి సామాజిక వర్గానికే వెళుతున్నాయని పేర్కొంటున్నారు.