హైదరాబాద్: జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు రహస్యంగా మంతనాలు జరిగాయి. శ్రీశైలం యాదవ్ తనయుడు నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండగా కిషన్ రెడ్డి శ్రీశైలం యాదవ్ ని కలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సమావేశ అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఒక ఎంపీగా ప్రచారంలో భాగంగా తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం నియోజకవర్గ పరిధిలోని సీనియర్ నాయకులను కలుస్తున్నారని అదే తరహాలో శ్రీశైలంతో కలిసినట్లు చెప్పారు. తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని శ్రీశైలం యాదవ్ ను అభ్యర్థించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.
కేవలం మర్యాదపూర్వకంగానే కిషన్ రెడ్డి తమ ఇంటికి వచ్చారని, అతిథిగా వచ్చిన ప్రతి ఒక్కరిని ఏ విధంగా అయితే గౌరవిస్తామో అదే తరహాలో ఆయన గౌరవించినట్లు శ్రీశైలం యాదవ్ తెలిపారు. పార్టీలోకి ఆహ్వానించేందుకు మాత్రం రాలేదని స్పష్టం చేశారు.