Sunday, September 8, 2024

బాధ్యతలు చేపట్టిన కేంద్రమంత్రులు

- Advertisement -

బాధ్యతలు చేపట్టిన కేంద్రమంత్రులు

Union Ministers who took charge
Union Ministers who took charge

న్యూఢిల్లీ, జూన్ 13,
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయంలో బండి సంజయ్ బాధ్యతలు చేపట్టారు. భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయకుల సందడి లేకుండానే ఛార్జ్ తీసుకున్నారు. జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామీజీ సమక్షంలో హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో దేశ భద్రత కోసం పనిచేసేందుకు అహర్నిశలు కృషిచేస్తానని బండి సంజయ్ పేర్కొన్నారు.కాగా.. బండి సంజయ్ కుమార్.. 2019లో తొలిసారిగా కరీంనగర్‌ నుంచి ఎంపీగా గెలిచారు. తరువాత భారతీయ జనతా పార్టీ  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా పార్టీ విస్తరణకు చర్యలు తీసుకున్నారు. 2020 మార్చి 11 నుంచి 2023 జులై 3వ వరకు రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో పార్టీకి సేవలందించారు. ప్రస్తుతం BJP జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తూ.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా గెలిచారు. దీంతో కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కించుకున్నారు.
కిషన్ రెడ్డి
ఢిల్లీ శాస్త్రి భవన్‌లో బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు కిషన్ రెడ్డి. అంతకుముందు తెలంగాణ భవన్‌లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అలాగే కుటుంబ సమేతంగా తెలంగాణ భవన్‌లోని పలు ఆలయాల్లో ప్రత్యే పూజలు చేశారు. అనంతరం బంగ్లా సాహిబ్ గురుద్వారాను దర్శించుకోనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. తెలంగాణ భవన్‌ బయట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి వందనం సమర్పించారు. ఆ తర్వాత.. అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లికూడా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్‎తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సికింద్రాబాద్ నుంచి వరుసగా గెలుపొందుతున్న బీజేపీ కీలక నేత, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కీలక శాఖలను కేటాయిస్తూ వచ్చింది. ముందు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న ఆయనకు గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచినందుకు కేంద్ర సాంస్కృతిక శాఖను అప్పగించింది. ఈసారి అత్యంత కీలకమైన కేంద్ర బొగ్గు, గనుల శాఖను కేటాయించడంతో తెలుగు రాష్ట్రాలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని పలువురు భావిస్తున్నారు. మోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నామని అన్నారు. ‘అన్ని రాష్ట్రాల్లో గత పదేళ్లలో ప్రధాని మోదీ విద్యుత్ కొరతకు చెక్ పెట్టారు. ఆయన నాయకత్వంలో గత పదేళ్ల నుంచి వ్యవసాయానికి, పరిశ్రమలకు, గృహాలకు సరిపోను కరెంట్ వస్తోంది. దానికి ప్రధానమైన కారణం.. బొగ్గు. దీని ద్వారానే ఈ రోజు ఎక్కువ శాతం విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి మనం కొంత దిగుమతి చేసుకుంటున్నాం. రానున్న రోజుల్లో మన అవసరాలకు సరిపోయేలా దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంచుతాం. ఖనిజాల అన్వేషణ, తవ్వకాల ద్వారా ఉపాధి అవకాశాలను పెంచడం, భారత్ ఖనిజాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసి ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా కృషి చేస్తాం. అధికారులందరితో కలిసి టీమ్ వర్క్‌తో పనిచేసి భారత్‌ను అగ్రపథంలో నడిపించేందుకు క్రమశిక్షణతో, చిత్తశుద్ధితో పనిచేస్తా.’ అని కిషన్ రెడ్డి తెలిపారు.
రామ్మెహననాయుడు
కేబినెట్‌లో అత్యంత చిన్న వయసులో నాపై ప్రధాని మోదీ తనపై బాధ్యత పెట్టారని.. ఇది యువతపై ప్రధానికి ఉన్న నమ్మకం అని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్‌లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అశోక్ గజపతిరాజు హయాంలో ఏపీలోని భోగాపురం ఎయిర్‌పోర్టుకు పునాది పడిందని.. గత ఐదేళ్లలో అక్కడ అభివృద్ధి కుంటుపడిందని చెప్పారు. రికార్డు సమయంలో ఆ ఎయిర్‌పోర్టు పూర్తి చేసి విమానాలను ల్యాండ్ చేస్తాం. ‘పౌర విమానయాన శాఖ ఇచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. శాఖకు సంబంధించి 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నాం. సాంకేతిక వినియోగంతో పౌర విమానయానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. సామాన్యుడికి ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ తీసుకువస్తాం. ప్రయాణికునికి భద్రత, సౌకర్యంగా ఉండేలా చూస్తాం. ఎయిర్‌పోర్టులను పర్యావరణ హితంగాచేయడానికి చర్యలు చేపడతాం. సామాన్య ప్రయాణికుడికి విమానయానం అందుబాటులోకి తీసుకొచ్చేలా చేస్తాం. టైర్ 2, టైర్ 3 నగరాలకు విమానాశ్రయాలు తీసుకొస్తాం. రాజమహేంద్రవరం, కడప, కర్నూలు ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేస్తాం. తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించి అక్కడ విమానయాన శాఖ కార్యక్రమాలు ప్రోత్సహిస్తాం.’ అని రామ్మోహన్ పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్