- Advertisement -
బీజేపీ, కాంగ్రెస్ మధ్య లేఖల యుద్ధం
War of letters between BJP and Congress
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19, (వాయిస్ టుడే)
దేశంలోని రెండు అగ్రపార్టీల మధ్య లేఖల యుద్ధం సాగుతోంది. లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై చేసిన ప్రకటన తర్వాత బీజేపీ, దాని మిత్ర పక్షాల నేతలు రాహుల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోడీకి లేఖ రాశారు. కేంద్రమంత్రి రవ్‌నీత్ బిట్టూ.. రాహుల్‌ను నంబర్ వన్ టెర్రరిస్ట్‌గా అభివర్ణించారని.. బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. రాహుల్ పై దాడి చేస్తామని బెదిరించారని ఆ లేఖలో పేర్కొన్నారు. మరో ఎమ్మెల్యే రాహుల్ నాలుక కోస్తే 11 లక్షలు రివార్డు ఇస్తానని ప్రకటించారని.. ఇది చాలా దారుణమని ఖర్గే.. ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇవి భారత ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఉన్నందున అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.ఖర్గే రాసిన లేఖపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. గతంలో ప్రధాని మోడీని రాహుల్‌గాంధీ విమర్శిస్తే ఖర్గే ఎందుకు మాట్లాడ్డం లేదని నడ్డా ప్రశ్నిస్తూ.. లేఖ విడుదల చేశారు. విదేశాల్లో భారత్‌ను చులకన చేయడం మానుకోవాలని నడ్డా సూచించారు. మోడీ తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టకుండా దుర్భాషలాడారని.. ఆ సందర్భాల్లో ఖర్గే ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రధానిపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరకర పదాలు ఉపయోగించారని నడ్డా లేఖలో ప్రస్తావించారు.పాకిస్తాన్ అనుకూల.. భారత వ్యతిరేక శక్తుల మద్దతు రాహుల్ కూడగడుతున్నారన్న బీజేపీ అధ్యక్షుడు.. దేశంలో కుల రాజకీయాలను రాహుల్ రెచ్చగొడుతున్నారని విమర్శలు గుప్పించారు. రాహుల్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు గర్వపడుతుందని నడ్డా ప్రశ్నించారు. దేశ ప్రయోజనాల కోసం పని చేయడానికి మీకు జ్ఞానం, శక్తిని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని నడ్డా లేఖలో పేర్కొన్నారు. పదేళ్ల వ్యవధిలో దేశప్రధాని మోడీని.. కాంగ్రెస్ నేతలు 110 సార్లు దుర్భాషలాడారని.. ఇందులో కాంగ్రెస్ అగ్రనాయకత్వం కూడా పాలుపంచుకోవడం దురదృష్టకరమని నడ్డా అన్నారు
- Advertisement -