22ఏపై 24 గంటల్లో 34 రిజిస్ట్రేషన్లు చేశాం: పొంగులేటి
We completed 34 registrations in over 24 hours: Ponguleti
హైదరాబాద్, ఆగస్టు 18 (వాయిస్ టుడే): 22ఏ నిషేధిత భూముల జాబితాలో చోటుచేసుకున్న పొరపాట్లను ప్రభుత్వం గుర్తించి సరిదిద్దుతోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సామాన్య ప్రజల హక్కులు, ఆస్తులకు పూర్తి రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు.
సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. 22ఏ జాబితా కారణంగా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సమస్య పరిష్కార ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, గత 24 గంటల్లో మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో 30, రంగారెడ్డి జిల్లాలో 4.. మొత్తం 34 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని వెల్లడించారు.
హైకోర్టు ఆదేశాల మేరకు 22ఏ నిషేధిత భూముల వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసే సమయంలో జరిగిన సాంకేతిక, క్షేత్రస్థాయి పొరపాట్ల వల్ల కొన్ని ప్రైవేట్ భూములు నిషేధిత జాబితాలో చేరాయని మంత్రి వివరించారు. గత ప్రభుత్వాల కాలంలో వివిధ జీవోలు, మెమోల ద్వారా క్రమబద్ధీకరించిన భూములతో పాటు హైకోర్టు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతులు పొందిన కొన్ని స్థలాలు కూడా జాబితాలోకి వచ్చినట్లు తెలిపారు.
సమస్య పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని, రాబోయే 15 రోజుల పాటు రోజువారీగా దరఖాస్తులను పరిశీలించి, నిజమైన ప్రైవేట్ ఆస్తులను త్వరితగతిన క్లియర్ చేస్తామని పొంగులేటి వెల్లడించారు.
“పొరపాటును పారదర్శకంగా అంగీకరించాం. అదే సమయంలో దాన్ని సరిదిద్దే బాధ్యత కూడా తీసుకున్నాం. పేదవాడి న్యాయబద్ధమైన భూమిలో ఒక్క అంగుళం కూడా అన్యాయం జరగనివ్వం” అని మంత్రి స్పష్టం చేశారు.
22ఏ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవద్దని, అబద్ధాలు, ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించలేరని అన్నారు. తప్పును అధికారులపైకి నెట్టేసి తప్పించుకోవడం తమ ప్రభుత్వ విధానం కాదని, “తప్పును ఒప్పుకుని దిద్దుతున్నాం” అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.




