రాజకీయ అభిప్రాయాలు వేరైనా అభివృద్ధి విషయంలో కలిసి పనిచేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -

కలెక్టరేట్‌ పేదవాడికి నమ్మకమైన నిలయం కావాలి

నిస్సహాయతతో గడప తొక్కే ప్రతి ఒక్కరికీ భరోసా కల్పించాలి

ప్రజల సమస్యలను కుటుంబ సభ్యుల సమస్యలుగా భావించి పరిష్కరించాలి

రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యతగా పనిచేస్తాం

రాజకీయ అభిప్రాయాలు వేరైనా అభివృద్ధి విషయంలో కలిసి పనిచేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

We must work together on development despite differing political views: CM Revanth Reddy

We must work together on development despite differing political views: CM Revanth Reddy
We must work together on development despite differing political views: CM Revanth Reddy

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 30 (వాయిస్‌ టుడే):
సమస్యలు, బాధలు, నిస్సహాయ స్థితిలో కలెక్టరేట్‌ గడప తొక్కే ప్రతి పేదవాడికి ప్రభుత్వం అండగా ఉందనే నమ్మకం, భరోసా కలిగించేలా సమీకృత జిల్లా కలెక్టరేట్‌ పనిచేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజల సమస్యలను కుటుంబ సభ్యుల సమస్యలుగా భావించి పరిష్కరించాలని, వారి కన్నీరు తుడిచేలా అధికారులు పనిచేయాలని సూచించారు.

కరీంనగర్‌ నూతన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు, కేంద్ర–రాష్ట్ర సమన్వయం తదితర అంశాలపై మాట్లాడారు.

పేదల సమస్యల పరిష్కారమే లక్ష్యం

కలెక్టరేట్‌కు సహాయం కోసం వచ్చే ప్రజలతో అధికారులు మానవత్వంతో వ్యవహరించాలని సీఎం అన్నారు. నిస్సహాయంగా కార్యాలయానికి వచ్చే వారిలో తమ కుటుంబ సభ్యులను చూసుకోవాలని సూచించారు.

కుటుంబ సభ్యులకు సమస్య ఎదురైతే ఎలా స్పందిస్తామో, అదే విధంగా ప్రజల సమస్యల పట్ల స్పందించాలని అన్నారు. అలా పనిచేస్తే ప్రజలకు న్యాయం చేయడంతో పాటు ప్రభుత్వంపై నమ్మకం, భరోసా పెరుగుతుందని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల ప్రయోజనాలు అత్యంత నిరుపేద వర్గాలకు చేరేలా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలని సూచించారు.

ప్రభుత్వానికి మంచి పేరు.. చెడ్డ పేరు ఉద్యోగుల పనితీరుపైనే

ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా, చెడ్డ పేరు రావాలన్నా ఉద్యోగుల పనితీరే కీలకమని సీఎం అన్నారు. ప్రభుత్వాలు చట్టాలు చేయడం, నిధులు, అనుమతులు మంజూరు చేయడం వరకు మాత్రమే చేయగలవని, వాటి ప్రయోజనాలను ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులపై ఉందన్నారు.

రాష్ట్రంలో పర్మినెంట్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ తదితర విధానాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు దాదాపు పదిన్నర లక్షల మంది ఉన్నారని, వారు కోట్లాది ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు.

ప్రజాపాలన ప్రారంభమైన సమయంలో ఉద్యోగులకు ఒకటో తేదీన జీతభత్యాలు చెల్లించలేని పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం జీతభత్యాలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పదోన్నతులు, బదిలీలు, ఆరోగ్య భద్రత కార్డులు తదితర సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని సీఎం తెలిపారు.

కేంద్రంతో సఖ్యతగా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం

రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు వెళ్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి అవసరమైన పనులు సాధించుకోవడానికి కేంద్రంతో సఖ్యతగా పనిచేస్తామని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో కరీంనగర్‌ నగర అభివృద్ధికి అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌ కింద రూ.840 కోట్లతో పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రానికి అవసరమైన అభివృద్ధి పనులకు కేంద్రం సహకరిస్తే అభినందించడంలో తనకు ఎలాంటి సంకోచం లేదన్నారు.

రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ఎన్నిసార్లయినా ఢిల్లీకి వెళ్తామని సీఎం స్పష్టం చేశారు.

గౌరవెల్లి ప్రాజెక్టుపై కేంద్రంతో సంప్రదింపులు

గౌరవెల్లి రిజర్వాయర్‌ పనులు 98 శాతం పూర్తయ్యాయని సీఎం తెలిపారు. సుప్రీంకోర్టులో కేసు కారణంగా మిగిలిన పనులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇటీవల అనుకూలమైన తీర్పు వచ్చిన నేపథ్యంలో పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి కోరినట్లు చెప్పారు.

వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రాజెక్టులు నిర్మించినా వాటి వినియోగానికి అవసరమైన అనుమతులు లేకపోతే ప్రజలకు ప్రయోజనం ఉండదని అన్నారు.

కంటోన్మెంట్‌ సమస్య పరిష్కారానికి చర్యలు

హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌, నిజామాబాద్‌ తదితర ఉత్తర తెలంగాణ జిల్లాలకు వెళ్లే మార్గంలో కంటోన్మెంట్‌ ప్రాంతం కీలక అడ్డంకిగా ఉందని సీఎం అన్నారు.

రహదారి నిర్మాణం కోసం కంటోన్మెంట్‌ ప్రాంతంలో 170 ఎకరాల డిఫెన్స్‌ భూమిని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అప్పగించిందని తెలిపారు. బేగంపేట విమానాశ్రయం రన్‌వే కారణంగా ఇబ్బంది ఉన్న ప్రాంతంలో టన్నెల్‌ రోడ్డు నిర్మాణానికి కూడా అనుమతులు లభించాయని చెప్పారు.

ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.5,000 కోట్లతో చర్యలు చేపడుతోందని సీఎం తెలిపారు.

రాజకీయ భేదాలు ఉన్నా.. అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తాం

రాజకీయ, సిద్ధాంతపరమైన అభిప్రాయాలు వేరుగా ఉన్నప్పటికీ ప్రజల అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

కరీంనగర్‌ నగర అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

కరీంనగర్‌ జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులు, పెండింగ్‌ పనులపై త్వరలోనే మరోసారి పూర్తిస్థాయి ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు.

రూ.51 కోట్లతో నూతన కలెక్టరేట్‌ ప్రారంభం

కరీంనగర్‌లో రూ.51 కోట్లతో నిర్మించిన నూతన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సముదాయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ, పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌, జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా, పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం తదితరులు పాల్గొన్నారు.

అనంతరం కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్‌ ఛాంబర్‌ను సందర్శించి, వేద మంత్రాలు, సర్వమత ప్రార్థనల మధ్య కలెక్టర్‌ చిత్రా మిశ్రాను కుర్చీలో కూర్చోబెట్టారు. ఇన్‌చార్జి మంత్రి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టేట్‌ చాంబర్‌ను కూడా పరిశీలించారు.

రూ.1,096.22 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

జిల్లాలో రూ.1,096.22 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు. రూ.29.62 కోట్లతో మూడు తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్ల నిర్మాణ పనులు, అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌ కింద రూ.840 కోట్లతో కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో చేపట్టనున్న పనులు ఇందులో ఉన్నాయి.

యూఐడీఎఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ స్కీం కింద రూ.180 కోట్లతో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు, కేఎస్‌సీసీఎల్‌ స్పెషల్‌ గ్రాంట్స్‌ కింద రూ.21.60 కోట్లతో వరదనీటి మురుగు కాల్వల పనులు, రూ.25 కోట్లతో మల్టీలెవెల్‌ కార్‌ పార్కింగ్‌ భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.

పలు అభివృద్ధి భవనాలు ప్రారంభం

రూ.5.70 కోట్లతో నిర్మించిన సెంట్రల్‌ లైబ్రరీ భవనం, రూ.6.50 కోట్లతో నిర్మించిన కాశ్మీర్‌గడ్డ సమీకృత వెజ్‌–నాన్‌ వెజ్‌ మార్కెట్‌, రూ.16.50 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, డీఆర్‌ఎఫ్‌ కార్యాలయాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

అనంతరం జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని సన్మానించి మెమెంటోలు అందజేశారు.

పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు

ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద, కరీంనగర్‌ మేయర్‌ శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ బొమ్మ శ్రీరామ్‌ చక్రవర్తి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు మల్లేష్‌, కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నరసన్న, ఆర్టీఏ నెంబర్‌ పడాల రాహుల్‌, డిప్యూటీ మేయర్‌ సునీల్‌రావు, ట్రైనీ కలెక్టర్‌ హరిప్రసాద్‌, పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో స్వామి, వివిధ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular