కరీంనగర్, నవంబర 7, (వాయిస్ టుడే ): జగిత్యాల జిల్లా కేసీఆర్ పాలనలో తెలంగాణ నవ్వుల పాలైందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవాళ అట్టహాసంగా భారీ అనుచర గణం పార్టీ శ్రేణులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారన్నారు. బలిదానాలతో తెలంగాణ ఏర్పడిందని..ఉద్యమ నాయకుడిగా గుర్తింపు పొందిన కేసీఆర్ కు రాష్ట్ర ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారని, ఉద్యమ ఆశయాలను నెరవేర్చడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.అంతేకాకుండా.. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ప్రత్యామ్నాయంగా ఉంది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రథమ లక్ష్యం. ఉచిత విద్య వైద్యం ఉపాధి వంటివి కేసీఆర్ పాలనలో మెరుగుపడలేదు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా టీఏడీఏ పీ ఆర్ సి సంగతి తర్వాత ఒకటో నెల వేతనాలు వస్తే అదే చాలు అన్నట్లుగా విసిగి వేసారి ఉన్నారు. రైతుబంధు పేరు చెప్పి రైతుల నోరు నొక్కుతున్నారు. రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలన్ని ఎత్తివేశారు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతులను నిండా ముంచుతున్నారు. స్వయం ఉపాధి పథకాలను నిలిపివేశారు. కాలేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రం అప్పుల పాలైంది. కాలేశ్వరంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదు. కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో భాగస్వామ్యం గా ఉన్న ఏ అధికారులను నాయకులను వదిలిపెట్టం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేస్తాం’ అని జీవన్ రెడ్డి అన్నారు.