Monday, December 23, 2024

కూటమిలో ఎవరికి వారే…

- Advertisement -

కూటమిలో ఎవరికి వారే…

Who are they in the coalition?

నెల్లూరు, అక్టోబరు 5, (వాయిస్ టుడే)
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇటీవలే వంద రోజులు దాటింది. అయితే పిఠాపురం నుంచి ఆదోని వరకూ, ధర్మవరం నుంచి ఒంగోలు వరకూ కూటమి పార్టీల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. కూటమికి ముందు కుదిరిన పొత్తులతో మూడు పార్టీలు ఏకమై జగన్ ప్రభుత్వాన్ని అయితే ఓడించగలిగారు కానీ, తమ నియోజకవర్గంలో గెలిచిన నేతలు ఆధిపత్యాన్ని సహించలేకపోతున్నారు. ఇగోలు విభేదాలకు ప్రధాన కారణం. ఎవరి పార్టీ వారిదే. ఎవరి జెండా వారిదే. ఎవరి అజెండా వారిదే. తమ పార్టీ క్యాడర్ కోసమే కూటమి పార్టీలు పట్టుబడుతుండటంతో మిత్రపక్షాలకు చెందిన నేతల్లో విభేదాలు రచ్చకెక్కాయని చెప్పక తప్పదు. ఇందులో ఏ పార్టీ నేతదీ తప్పు కాదు.ఎందుకంటే ఎవరి క్యాడర్ ను వారు కాపాడుకోవాలి. ఎవరి జెండాను వారు పదిలంగా ఉంచుకోవాలి. 2024 ఎన్నికలలో కూటమి పార్టీల క్యాడర్, నేతలు అందరూ కలసికట్టుగా పనిచేశారు. టిక్కెట్ దక్కకపోయినా కలసి మెలసి జెండాలను మోశారు. అయితే కూటమి పార్టీల మధ్య ఎన్నికల అనంతరం మాత్రం విభేదాలు అధినాయకత్వాలను కలవరపెడుతున్నాయి. ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహించే పిఠాపురంలోనూ టీడీపీ, జనసేనల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన ఎస్‌వీఎస్ఎన్ వర్మ ప్రభుత్వం ఏర్పాటయిన నెల రోజుల నుంచే అసంతృప్తితో ఉన్నారు.అక్కడ జనసేన నేతలకు, వర్మకు మధ్య గ్యాప్ బాగా పెరిగింది. లోకల్ నాయకత్వం మధ్య అస్సలు పొసగడం లేదు. తాజాగా పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలకు అమితుమీ సిద్ధమవుతున్నారు టీడీపీ, జనసేన నేతలు. ఈ ఎన్నికలు పార్టీ గుర్తు లేకుండా జరిగేవి అయినా అధికారం ఉన్న పార్టీలు డైరెక్టర్ల పదవులను పంచుకుని ఏకగ్రీవం చేసుకునే వీలుంది. ఐదు డైరెక్టర్ల పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగానే జనసేన నేతలు తమ అభ్యర్థులను రంగంలోకి దించారు. దీంతో వర్మ కూడా తన అనుచరులను పోటీకి దించి సై అన్నారు. రెండు పార్టీల నుంచి చెరో ఐదుగురు పోటీ చేస్తుండటంతో రెండు పార్టీల మధ్య పోటీ అనివార్యమయింది. ఒక రకంగా రెండు పార్టీలూ బలనిరూపణకు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.ఆదోని నియోజకవర్గంలో అక్కడి సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే పార్థసారధి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడుకు మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు పొడసూపాయి. ఇద్దరు వేర్వేరుగా ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో క్యాడర్ కూడా రెండుగా విడిపోయారు. ఆధిపత్య పోరే దీనికి కారణమని తెలుస్తోంది. ఇక ధర్మవరంలో బీజేపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు టీడీపీ నేతలకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మున్సిపల్ కమిషనర్ నియామకం ఇందుకు కారణం. ఒంగోలులో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. జనసేనలో చేరిన బాలినేని వదిలేది లేదని చెబుతున్నారు. ఇవి కేవలం ఉదాహరణ మాత్రమే అనేక నియోజకవర్గాల్లో కూటమి పార్టీల నేతల మధ్య రచ్చ రంబోలా పార్టీ అధినేతలకు తలనొప్పిగా మారనున్నాయి. ధర్మవరంలో ఎన్నికల ముందు వరకూ ఉన్న ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ ను కాదని కూటమి ఏర్పడిన తర్వాత ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించింది. అప్పటి వరకూ తానే విజేత అని భావిస్తున్న నాటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సత్యకుమార్ ను ఎంపిక చేయడంతో గెలుపు తనదేనని భావించారు. అయితే టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు సమిష్టిగా పనిచేసి ధర్మవరంలో కేతిరెడ్డిని స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓడించగలిగారు. మిగిలిన నియోజకవర్గాల్లో యాభై వేలకు పైన వచ్చి మెజారిటీలు ధర్మవరానికి వచ్చేసరికి మాత్రం రెండు వేలకు మించలేదు. అయినా అందరూ కలసి పనిచేయడంతోనే సత్యకుమార్ విజయం సాధించారు/అయితే అదృష్టం సత్యకుమార్ ఇంట్లోనే ఉంది. కేవలం ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా బీజేపీలో నమ్మకమైన నేతగా ఉన్న ఆయనకు చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి లభించింది. హేమాహేమీలను పక్కన పెట్టారు. సత్యకుమార్ కు అత్యంత కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను అప్పగించారు. కానీ సత్యకుమార్ మాత్రం వైసీపీ స్థానిక నేతలను దగ్గరకు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ, జనసేన కంటే వైసీపీ నేతలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అక్కడ విమర్శలు బాహాటంగా చేస్తున్నారు. మరోవైపు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి ప్రధానమైన వారిని దూరం చేయడానికే సత్యకుమార్ వైసీపీ వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వ సమయంలో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డికి అనకూలంగా వ్యవహరించిన మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునను ధర్మవరానికి సత్యకుమార్ తీసుకురావడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయానికి కూడా పెద్దయెత్తున ఫిర్యాదులు అందాయి. తమను వేధించిన కమిషనర్ ను సత్యకుమార్ కావాలనే మున్సిపల్ కమిషనర్ గా తీసుకు వచ్చారంటూ టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. మరోవైపు పరిటాల శ్రీరామ్ కూడా సత్య కుమార్ వ్యవహారశైలిపై అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. ఆయన బహిరంగంగా బయట పడకపోయినా, ఆయన వర్గీయులు మాత్రం రోడ్ల మీదకు వచ్చి ఆందోళనకు దిగడం ఇప్పుడు ధర్మవరంలో టీడీపీకి ఇబ్బందిగా మారింది. దీనిపై సత్యకుమార్ తో చర్చించి సమస్యను పరిష్కరించాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు తెలిసింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్