తెలంగాణ బరిలో ఎవరికి వారే…
మిత్రపక్షాల మధ్య బేధాలు
హైదరాబాద్, జనవరి 28, (వాయిస్ టుడే )
Who is in the Telangana race…
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ జనసేన పార్టీ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జనసేన పార్టీ ఒంటరిగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి నేతృత్వంలో పార్టీ ఇప్పటికే దూకుడు పెంచింది. బుధవారం నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుండటంతో, పార్టీ అభ్యర్థుల ఎంపికను దాదాపు పూర్తి చేసింది. ఇప్పటికే ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన పార్టీ బరిలోకి దిగేదుకు సిద్ధమైంది. ఏపీలో అద్భుతమైన స్ట్రైక్ రేట్ సాధించిన జోష్‌తో, తెలంగాణలోనూ తన సత్తా చాటాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారుజాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన, తెలంగాణలో మాత్రం బీజేపీని కాదని ఒంటరిగా ముందుకు వెళ్లడం ఆశ్చర్యపరుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుతో పోటీ చేసిన ఈ రెండు పార్టీలు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల విషయంలో పరస్పరం దూరంగా ఉంటున్నాయి. బీజేపీ సైతం జనసేన పోటీపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం, పొత్తుల గురించి ప్రస్తావించకపోవడం చూస్తుంటే.. కమలం పార్టీ కూడా ప్రస్తుతానికి ఒంటరి పోరుకే మొగ్గు చూపుతున్నట్లు అర్థమవుతోంది.జనసేన పోటీ ప్రధానంగా బీజేపీ ఓట్లకు గండి కొట్టే అవకాశం ఉంది. తెలంగాణలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బీజేపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఇప్పుడు అదే పట్టణ ఓటర్లలో పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఇమేజ్, ముఖ్యంగా యువతలో ఉన్న క్రేజ్ కారణంగా ఓట్లు చీలిపోయే ప్రమాదం కనిపిస్తోంది. జనసేన చీల్చే కొద్దిపాటి ఓట్లయినా అది పరోక్షంగా అధికార కాంగ్రెస్ లేదా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌కు లాభం చేకూర్చే అవకాశం ఉంది. ఒకవేళ జనసేన తన బలాన్ని నిరూపించుకుంటే, భవిష్యత్తులో తెలంగాణలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ఈ ఎన్నికలు పునాదిగా మారతాయి.జనసేన వ్యూహం కేవలం ఓట్లు చీల్చడమే కాదని, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడమే ప్రథమ లక్ష్యమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న తమ పార్టీ ఇమేజ్ కీలక మున్సిపాలిటీలు, ఖమ్మం, నిజామాబాద్ వంటి చోట్ల తమకు కలిసి వస్తుందని వారు ఆశిస్తున్నారు. బీజేపీతో పొత్తు లేకపోవడం వల్ల ఆ పార్టీ అసంతృప్త నేతలు కూడా జనసేన వైపు చూసే అవకాశం ఉందని చెబుతున్నారు. బీజేపీ నాయకత్వం మాత్రం జనసేన ప్రభావం పెద్దగా ఉండదని భావిస్తోంది. అయినప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో చీలిపోయే ప్రతి ఓటు గెలుపోటములను తలకిందులు చేసే అవకాశం ఉన్న మున్సిపల్ పోరులో, జనసేన సై అనడం బీజేపీకి మింగుడుపడని విషయమే. ఈ ఫ్రెండ్లీ కాంటెస్ట్ ‘ మున్సిపల్ ఫలితాల తర్వాత తెలంగాణలో ఎన్డీఏ భవిష్యత్తును ఏ విధంగా మారుస్తుందో వేచి చూడాలి. గతంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అయితే బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారన్న కారణంగా పోటీ నుంచి విరమించుకున్నారు. ఈ సారి అలా నామినేషన్లు వేసిన తర్వాత ఉపసంహరించుకునే అవకాశం ఉండదని జనసేన వర్గాలు చెబుతున్నాయి.


