ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచార పర్వంలో మునిగి తేలుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరించబోతోందనే అంశంపై భిన్న అంచనాలు వెలువడుతున్నాయి.
రాష్ట్రంలో మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీతో పాటు కొత్తగా కూటమి కట్టిన బీజేపీ, జనసేన, టీడీపీకా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తాజా పరిస్ధితులపై మరో సర్వే ఫలితాలు వెలువడ్డాయి.
2018 నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో సర్వేలు చేస్తున్న వైబ్రాంట్ ఇండియా అనే సంస్ధ తాజాగా ఏపీలో నిర్వహించిన సర్వే ఫలితాలను ప్రకటించింది. ఇందులో రాష్ట్రంలో వైసీపీకీ, ఎన్డీయే కూటమికీ ముఖాముఖీ పోరు నెలకొందని తేల్చి చెప్పేసింది. అంతే కాదు పలు చోట్ల హోరాహోరీ పోరు సాగబోతోందని ఈ సర్వే తేల్చింది. రాష్ట్రంలోని 175 సీట్లలో 29 స్ధానాల్లో పరిస్ధితి నువ్వా నేనా అన్నట్లు ఉందని సర్వే ఫలితాల్లో వెల్లడించింది.
రాష్ట్రంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీకి ఎదురుదెబ్బ ఖాయమని వైబ్రాంట్ ఇండియా సర్వే తేల్చేసింది. వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన ఎన్డీయే కూటమి పార్టీలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈసారి ఎన్డీయే కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడిగా 115 నుంచి 120 సీట్లు కైవసం చేసుకుంటాయని ఈ సర్వే తేల్చిచెప్పింది. వైసీపీ కేవలం 55 నుంచి 60 సీట్లకే పరిమితం అవుతుందని ఈ సర్వే ఫలితాలు తెలిపాయి. వైసీపీ 29 సీట్లలో కచ్చితంగా గెలుస్తుందని, మరో 18 సీట్లలో ఎడ్జ్ ఉంటుందని తెలిపింది. అలాగే ఎన్డీయే పార్టీలు 79 సీట్లు కచ్చితంగా గెలుస్తాయని, మరో 20 సీట్లలో ఎడ్జ్ ఉందని తేలింది.
ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలోని రాజకీయ పార్టీల ఓట్ల శాతాన్ని కూడా ఈ సర్వే వెల్లడించింది. ఇందులో టీడీపీ అత్యధికంగా 42.26 శాతం ఓట్లు సాధిస్తుందని, ఆ తర్వాత స్ధానంలో వైసీపీ 38.11 శాతం ఓట్లు సాధిస్తుందని తెలిపింది. ఎటూ తేల్చుకోని వారు 13 శాతం ఉన్నారని, ఇతరులకు 6 శాతం ఓట్లు పడతాయని తెలిపింది. అలాగే వైసీపీ, ఎన్డీయే కూటమి పార్టీల బలాలు, బలహీనతలను కూడా ఈ సర్వే వెల్లడించింది.
వైసీపీకి ఉన్న ప్లస్ పాయింట్లలో గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాల ప్రభావం, వాలంటీర్లు, వైసీపీ అధికారంలో ఉండటం, టీడీపీ, జనసేన కూటమికి బీజేపీ జతకలవడం వంటివి ఉన్నాయి. అలాగే వైసీపీకి మైనస్ గా అర్బన్ ప్రాంతాల్లో ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని తెలిపింది. ఇందుకు నిరుద్యోగం, అభివృద్ధి లేమి కారణాలుగా పేర్కొంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న, మధ్య తరగతి వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు, మధ్యతరగతిలో అసంతృప్తి మైనస్ గా పేర్కొంది. అలాగే మద్యం, ప్రభుత్వ ఉద్యోగాలు, ఇసుక, రోడ్లు, రాజధాని, కక్షా రాజకీయాలు, వైఎస్ కుటుంబంలో విభేదాలు కూడా మైనస్ కాబోతున్నట్లు తెలిపింది.
టీడీపీ కూటమికి ప్లస్ పాయింట్లలో ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకత, చంద్రబాబు అరెస్టు, జనసేనతో కూటమి కట్టడం, చంద్రబాబు అభివృద్ధి చేస్తారనే అంచనాలు, లోకేష్ పాదయాత్ర, అర్బన్ ప్రాంతాల్లో సానుకూలత ఉన్నాయి. అలాగే మైనస్ పాయింట్లలో టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ చేరడం, వైసీపీ అధికారంలో ఉండటం, కూటమి సీట్ల పంపకాల్లో తలెత్తుతున్న సమస్యలు వీరికి మైనస్ అవుతాయని ఈ సర్వే తెలిపింది.