- Advertisement -
బీజేపీ బ్యాక్ స్టెప్ ఎందుకు… Why is BJP taking a back step?
హైదరాబాద్, జూలై 10,
రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. తెలంగాణలో 8 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్‌లో 8 స్థానాలను గెలుచుకున్న కమలం పార్టీ వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం వేయాలని చూస్తోంది. అయితే, అందుకు అనుగుణంగా చర్యలు మాత్రం తీసుకోవడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు సీనియర్ నాయకులను తమ పార్టీలోకి లాక్కుంటోంది. కానీ, బీజేపీలో మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా ఇప్పటివరకు చేరింది లేదు. భవిష్యత్తులో అయినా బీజేపీలో చేరుతారా.. అనేది కూడా సస్పెన్స్‌గా మారింది. దీంతో జాయినింగ్స్ కమిటీ ఉన్నట్టా.. లేనట్టా? అనే ప్రశ్నలు శ్రేణుల్లో ఉత్పన్నమవుతున్నాయి.ఃవాస్తవానికి ఏ పార్టీలో లేనివిధంగా కేవలం చేరికలకే ప్రత్యేకంగా కమిటీ వేసిన పార్టీ బీజేపీ. ఈ బాధ్యతలను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు అధిష్టానం అప్పగించింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ కమిటీని ప్రకటించారు. అయితే, అప్పుడు పార్టీలో పలువురు చేరినా.. ఆశించిన స్థాయిలో మాత్రం ఆదరణ దక్కలేదు. ఒకానొక సమయంలో కమిటీ ఏర్పాటుపై సొంత పార్టీ నేతలే పెదవి విరిచారు. అసలు చేర్చుకునేందుకు కూడా ఒక కమిటీ ఉంటుందా? అని విమర్శలు చేసిన వాళ్లు కూడా ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’ పేరిట దూసుకుపోతుంటే బీజేపీలో మాత్రం ఎలాంటి జాయినింగ్స్ లేవు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సమానంగా సీట్లు సాధించిన కమలం పార్టీలో ఒక్కరంటే ఒక్కరు కూడా చేరకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం వేసేదెలా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.స్థానిక సంస్థల ఎన్నికల్లో హస్తం పార్టీ దూకుడుకు కళ్లెం వేయాలంటే కింది స్థాయిలో కేడర్‌ను పెంచుకోవాల్సి ఉంది. కానీ, అందుకు అనుగుణంగా కమలం పార్టీలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.గ్రౌండ్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కమలం పార్టీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని హైకమాండ్ ఆదేశించింది. కానీ, ఎన్ని కమిటీలు పూర్తయ్యాయనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. కాగా, ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తమకు టచ్‌లో 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని బాంబు పేల్చారు.అయితే, వారిని రాజీనామా చేయాలని కోరడంతో వారంతా తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. అయితే, వారంతా బీజేపీలో చేరతారా..లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది.స్థానిక సంస్థల్లో సత్తా చాటాలంటే గ్రౌండ్ లెవల్లో నేతల చేరిక తప్పనిసరి. బడా స్థాయి నేతలు చేరకపోయినా.. కార్యకర్తలు, శ్రేణులను చేర్చుకున్నా స్థానిక సంస్థలకు పనికొస్తుందని పలువురు నాయకులు భావిస్తున్నారు. కానీ, అందుకు అనుగుణంగా పార్టీ చర్యలు చేపట్టడం లేదని, చేరికల కమిటీ కూడా దృష్టి కేంద్రీ కరించడంలేదనే విమర్శలు వస్తున్నాయి. మరి తెలంగాణలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ ఎలాంటి వ్యూహరచన చేస్తుందనేది తెలియాలంటే వేచిచూడాల్సిందే.
- Advertisement -