- Advertisement -
ఎందుకీ డిప్యూటీ సీఎం అంశం
Why is the Deputy CM subject
విజయవాడ, జనవరి 22, (వాయిస్ టుడే)
మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ ఇటీవల వరుసగా టీడీపీ నేతలు గొంతు విప్పుతున్నారు. ఏపీలో టీడీపీ-బీజేపీ- జనసేనల కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆర్నెల్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు. మంత్రి వర్గంలో మూడు పార్టీల నేతలు ఉన్నారు. ఈ క్రమంలో గత నాలుగైదు రోజులుగా మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ అనూహ్యంగా తెరపైకి వచ్చింది.నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ ఇప్పటికిప్పుడు అనూహ్యంగా పుట్టుకొచ్చిందా, దీనికి వేరే కారణాలు ఉన్నాయా అనే చర్చ రాజకీయ పార్టీల్లో జోరుగా సాగుతోంది. సమయం, సందర్భం లేకుండా ఎందుకు లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్‌ను టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు భుజానికి ఎత్తుకున్నారనే సందేహాలు అందరిలోను ఉన్నాయి.టీడీపీ నేతల డిమాండ్లు వ్యూహాత్మకంగా చేసినవేననే అనుమానాలు కూడా ఇతర పార్టీల్లో ఉన్నాయి. ఈ క్రమంలో ఈ డిమాండ్ల వెనుక ఇతర కారణాలపై కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.ఈ వివాదానికి అసలు కారణం తిరుమలలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనగా తెలుస్తోంది. వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల జారీ సందర్బంగా తిరుపతిలోని బైరాగిపట్టెడలో ఉన్న రామానాయుడు స్కూల్ సమీపంలోని పద్మావతి పార్క్‌లో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు జనవరి 8వ తేదీన ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటన జరిగిన మర్నాడు సీఎం చంద్రబాబు ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి బాధితుల్ని పరామర్శించిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితుల్ని పరామర్శించారు. సాధారణంగా ముఖ‌్యమంత్రి పర్యటన తర్వాత ఇతర మంత్రులు విడిగా పర్యటించాల్సిన అవసరం ఉండదు. సీఎం పర్యటనలో వైద్య శాఖ మంత్రి సత్యకుమార్, బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు. ఘటన జరిగిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చే వరకు జనసేన ముఖ్య నేతలు ప్రమాదం జరిగిన ప్రాంతానికి రాలేదు.దర్శనం టోకెన్లు 9వ తేదీ గురువారం తెల్లవారుజామున జారీ చేయాల్సి ఉండగా బుధవారం ఉదయం నుంచి కౌంటర్ల వద్దకు భారీగా జనం చేరుకున్నారు. రామానాయుడు హైస్కూల్ జాతీయ రహదారికి దగ్గర్లో ఉండటంతో ఎక్కువ మంది టోకెన్ల కోసం అక్కడికే వచ్చారు. వారందర్నీ స్కూల్ దగ్గర్లో ఉన్న పార్కులోకి పంపి తాళాలు వేశారు. రాత్రి 8.40 గంటల సమయంలో ఓ మహిళ అస్వస్థతకు గురి కావడంతో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆమెను బయటకు తీసుకు రావడానికి గేటు తీశారు. అప్పటికే పార్కులో సామర్థ్యానికి మించి జనం ఉన్నారు.సరిగ్గా అదే సమయంలో పార్కులోకి మరో 50మందిని అనుమతించారు. ఓ రాజకీయ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుడు ఒత్తిడి చేయడంతో వారిని లోపలకు పంపారు. గేట్లు తీయడంతో క్యూ లైన్లలోకి వదులుతున్నారని వెనుక ఉన్నవారు భావించారు. దీంతో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. అప్పటికే ఉదయం నుంచి తిండితిప్పలు లేకుండా ఉన్న జనం బయటకు వెళ్లేందుకు ముందుకు పరుగులు తీశారు. ఇదంతా కూటమి పార్టీల్లోని ఓ చోటా నాయకుడి నిర్వాకం వల్ల జరిగిందని ఘటన జరిగిన రోజే పోలీసులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు.తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి వచ్చింది. అదే సమయంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ బాధితుల పరామర్శ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేశాయి. టీటీడీ ఛైర్మన్‌తో పాటు అందరూ క్షమాపణలు చెప్పాలని పవన్ ఏ ఉద్దేశంతో చేసినా అంతిమంగా ప్రభుత్వానికి మాత్రం విమర్శలు తప్పలేదు. పోలీసుల్ని, టీటీడీని బాధ్యుల్ని చేస్తూ పవన్ వ్యవహరించిన తీరు టీడీపీ నేతల్లో చాలామందికి రుచించలేదుతిరుపతిలో తొక్కిసలాట ఘటనకు కారణాలు స్పష్టంగా తెలిసినా పవన్ డిమాండ్‌తో తిరుపతి ఎస్పీని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ నిర్ణయం వైసీపీకి బాగా ఊరటనిచ్చింది. తిరుపతి ఎస్పీ ముఖ్యమంత్రికి సన్నిహితుడని వైసీపీ పలుమార్లు విమర్శలు గుప్పించింది. పవన్ డిమాండ్ కారణంగా ఎస్పీ సుబ్బారాయుడును ప్రభుత్వం బదిలీ చేసింది. పొత్తు ధర్మం కోసం చంద్రబాబు సర్దుకుపోతున్నా జనసేన నుంచి తగిన సహకారం లేదనే భావన టీడీపీలో ఉంది. జనసేన తరపున తీసుకునే ఏ నిర్ణయానికైనా చంద్రబాబు సంపూర్ణంగా సహకరిస్తున్నారని ఈ క్రమంలో అనవసర రాద్ధాంతం దేనికనే వాదన టీడీపీ చేస్తోంది.పవన్ కళ్యాణ్ ఇటీవల కర్నూలు జిల్లాలో గ్రీన్ కో సంస్థ నిర్మిస్తోన్న పవర్ ప్లాంటును సందర్శించారు. అటవీ పర్యావరణ మంత్రిగా ఉన్న పవన్ కర్నూలు జిల్లాలో నిర్మిస్తోన్న పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని సందర్శించారు. ఈ పర్యటన తర్వాతే టీడీపీ వైఖరిలో మార్పు వచ్చిందని జనసేన అనుమానిస్తోంది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ పర్యటనలపై టీడీపీకి అభ్యంతరం ఉండాల్సిన అవసరం ఏముందనేది ఆ పార్టీ వాదనగా ఉంది.కూటమి పార్టీల తరపున నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో కూడా జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సీఎం సీఎం అంటూ చేస్తోన్న నినాదాలు కూడా టీడీపీలో అసంతృప్తికి కారణం అయ్యాయి. సమయం సందర్భం లేకుండా చేస్తోన్న ఈ నినాదాలపై పవన్ కూడా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నినాదాలు కూడా ఉద్దేశ పూర్వకంగా జరుగుతున్నవనే అనుమానాలు టీడీపీలో ఉన్నాయి.మరోవైపు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కంటే నారా లోకేష్ ఎక్కువ అధికారాన్ని అనుభవిస్తున్నారనే భావన జనసేనలో ఉంది. కూటమి ప్రభుత్వంలో ఏ శాఖలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా అంతిమంగా నారా లోకేష్ అనుమతి పొందాలనే క్లారిటీ టీడీపీ మంత్రులకు స్పష్టత ఉంది. ఇది జనసేన వర్గాలకు రుచించడం లేదు. పేరుకు డిప్యూటీ సీఎం అయినా లోకేష్ వద్దే ఎక్కువ అధికారం ఉందని జనసేన భావిస్తోంది.పవన్ కళ్యాణ్ ఇటీవల సోదరుడు నాగబాబును మంత్రి వర్గంలో తీసుకోవాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు.నాగబాబు రాజ్యసభకు పంపాలని ప్రయత్నించినా మూడింటిలో ఒక స్థానం బీజేపీకి ఇవ్వడంతో జనసేనకు అవకాశం దక్కలేదు. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న జనసేన పార్టీలో పవన్‌కు సీఎం పదవి, నాగబాబుకు మంత్రి పదవి వంటి డిమాండ్లు చేస్తే 135మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీలో లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని అడిగితే తప్పేంటనే వాదన టీడీపీ వర్గాలు చేస్తున్నాయి.అదే సమయంలో జనసేనలో ఒక కులానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం కూడా చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవులు, ఎంపీలు, ఎమ్మెల్సీ అవకాశం, పిఏసీ ఛైర్మన్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్ వంటి పదవులు పవన్ చెప్పిన వారికే ఇచ్చారని టీడీపీ గుర్తు చేస్తోంది. నాగబాబుకు మంత్రి పదవి విషయంలో కూడా ఎలాంటి పేచీ పెట్టలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.లోకేష్‌ను టీడీపీతో చంద్రబాబు రాజకీయ వారసత్వాన్ని అందించే క్రమంలో తాజా డిమాండ్లు పుట్టుకొచ్చాయి. చంద్రబాబు తర్వాత ఆ పగ్గాలు నారా లోకేష్‌కు దక్కాలని టీడీపీ భావిస్తోంది. అదే సమయంలో ఏపీలో శాశ్వత రాజకీయ భవిష్యత్తు కోసం జనసేన ప్రయత్నాలు చేస్తోంది. పవన్ కళ్యాణ్ ముఖ‌్యమంత్రి అయ్యేందుకు ఏ అవకాశాన్ని జారవిడుచుకోకూడదని జనసేన భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు కులాలకు పరిమితమైన అధికార పగ్గాలను ఎప్పటికైనా దక్కించుకోవాలనే అకాంక్ష జనసేనలో బలంగా ఉంది.ప్రస్తుతం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు. రాజకీయ అవసరాల దృష్ట్యా అన్ని పార్టీలతో సర్దుకుపోయే ధోరణిలోనే చంద్రబాబు ఉన్నారు. అదే సమయంలో కుమారుడి రాజకీయ భవిష్యత్తు విషయంలో కూడా బాబు స్పష్టమైన అవగాహన ఉంటారని టీడీపీ సీనియర్లు చెబుతున్నారు. లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి డిమాండ్ కాకతాళీయంగా పుట్టుకొచ్చిందా, దీని వెనుక ముందస్తు వ్యూహాలు ఉన్నాయా అనేది కాలమే తేలుస్తుంది.
- Advertisement -